నీటి కాగితం దగ్గర కూర్చుని
నెమరేసుకోడానికి
ఈ సంధ్య చాలదు
ఈ చీకటినించి అలలచప్పుళ్లు
రక్షిస్తాయి
ఇసుకతిన్నెల మీద
పేర్లు రాసుకొన్నంత అలవోకగా
ఓళ్లో తల పెట్టుకు పడుకున్నంత నిశ్చింతగా
నీటి నిశ్శబ్ద స్వప్నమై
జీవితం పరిగెత్తనీ
రాత్రి పగటి ముఖచిత్ర మేమో
పవలు రాత్రి అర్ధ శరీరమే
కళ్లు మూసుకొన్న ప్రతిసారీ
స్వప్నించగలిగితే
ఆలొచనలన్నీ స్వప్నాలవును కదా
ప్రతీ స్వప్నమూ సుఖాంతమైతే
ఈ పీడకలల భయానకత నించి విముక్తి
సముద్రగర్భం జీవితం
ముత్యాలకోసం వెతికిన
గులకరాళ్ల జీవితం
వెలుతురుకోసం వెతుక్కుంటున్న చీకట్లొ
చీకటే వెలుతురు