నీకు మాత్రం తెలుసా!

పిలుస్తూనే ఉంటావు
పని ఉన్నా లేకున్నా

సాయంత్రం అయ్యేప్పటికి
రాత్రి – నిల్చున్నపళాన
వచ్చేసినట్టు
నీ పిలుపుకోసం
కాచుకుని ఉండాలా?

“ఎందందు వెదకిజూసిన..”
అని ఆ అబ్బాయి
అనేసేక ఇంక మిగిలిందేవుంది
ఆ తండ్రి ఎక్కడ చూపించమంటాడోనని
అన్ని చోట్లా తానే అన్నట్లు…

నేను సాదా సీదా మనిషిని
నాకూ చిన్నచిన్న పనులుంటాయి
ఆకాశం కేసి చూడడమో
పుస్తకంలో లీనమవడమో
ఏదో జ్ఞాపకాన్ని నెమరేసుకోవడమో
అంతెందుకు నీ పిలుపుకోసం
చూస్తూవుండడమో…

ఏదో మాటవరసకి పిలుస్తావు కానీ
ఎందుకు పిలిచేవో నీకు మాత్రం తెలుసా?!