ఊరికెళ్తానా..

‘మా ఇంటికి రా’
అని పిలుస్తాడో పాత స్నేహితుడు
తాను కొత్తగా కట్టుకొన్న ఇల్లు
తిప్పి చూపిస్తాడు
భార్యనీ పిల్లల్నీ
నాకు ఎరుక పరుస్తాడు
వేడి కాఫీ ఇచ్చి పంపిస్తాడు

ఇల్లు చూస్తూంటానా..
అక్కడే పాత ఇంట్లో
స్థంభాల చుట్టూ
పరిగెత్తి ఆడుకొన్న బాల్యం గుర్తొస్తుంది
అరుగు మీద కూర్చొని
దారిపోయే వాళ్లని
అల్లరిపెట్టడం…
ముచ్చిరేకు కాగితాలతో
అట్ట కిరీటాలు తగిలించుకొని
ఆడిన దుర్యోధనుడి ఏకపాత్ర గుర్తొస్తుంది
పరీక్ష ముందురోజు నిద్ర రాకుండా తాగిన టీ
చల్లరేలోగానే కళ్లుమూతలు పడ్డం…

ఇల్లు చూసేనా
తెర మీద సినిమా చూసేనా?