కబీరు,ఆమె, నేను

కబీరు మట్టి పాత్రల గురించి చెబుతూ ఉంటాడు

ఆమె అక్కడ చిన్న జంత్ర వాద్యాన్ని పట్టుకుని 

స్వరాన్ని శృతి చేసుకుంటూ

అల్లంత దూరం నుంచి నన్ను తడుముతూ..

ఎక్కడ లాహోరు ఎక్కడ నేను..

మాటలతో కాదు
చేతలతో కాదు చూపుతో కాదు
రాగ రంజిత స్వర సమ్మేళనంతో

దేహ దారులన్నీ తెలిసినట్లే
ఎముకలు నాడులు నరాలు ధమనులు
చర్మ రంద్రాలు
స్వర భేదంతో పదం విరుపుతో
ఆరోహణావరోహణాలతో

శిరస్సు కంపిస్తుంది
రక్త ప్రవాహం జోరు అందుకుంటుంది
కన్ను చెమరుస్తుంది
పాదం తొట్రు పడుతుంది

పిల్లలు గాలి పటాలెగరేసినట్టు
ఇసుకలో గూళ్ళు కట్టినట్టు
చెవిలో రహస్యాలు పలికినట్టు

కబీరు, ఆమె,నేను
దూరాలు తునుముతూ
పక్షుల కోసం చూస్తూ
నిర్మొహంలో…

(అబిదా పర్వీన్ కోసం)