ఒడ్డులేని మంచం

ఒంటరి మంచంమీద
ఒరుసుకు పడుకున్నా
చెరో ఒడ్డున పడుకున్నా
ఆ దారి వేరు.

నిద్రరాక ఒత్తిగిలినప్పుడు
నీకూ నిద్రాభంగం కావచ్చు

మధ్యరాత్రి
నీరు వదిలి
నీరు తాగే గుటక శబ్దానికి
నీకూ దాహం వేయచ్చు
నిద్రకీ మెలకువకీ మధ్య
మంచం ఒకటి

ఇవాళ ఆసుపత్రి మంచమ్మీద
నువ్వు
నొప్పిలేకుండా
మత్తుమందిచ్చిన నిద్ర

ఒడ్డులేని మంచమ్మీద
తేలుతూ కదులుతూ నేను