ఉదయమెప్పుడూ…



ఉదయమెప్పుడూ
అందమైనదే
నువ్వొక సముద్రం దగ్గరకో
నది ముంగిటకో పోనక్కరలేదు

నీ కిటికీ ముందు
రాలిన పారిజాతాల పరిమళం
చలి చక్కిలిగింతలో
మంచు జారే చెట్ల ఆకుల గాంభీర్యం

చలి నెగళ్లు
సంకీర్తనాల వెలుగులో
ధనుర్మాసం సందడి
తేలియాడే బృందగానాలతో
క్రీస్తు జనన సందోహం

డిసెంబరాలు,
నీలంబరాలు
గొబ్బి పువ్వులూ
గాల్లో తేమా

వసంతాన్ని తలపించే
చిక్కబడ్డ తుషారం
అలంకరాలతో నేల
ఋతుమతే

పొలాలు,
కుప్పలు పడ్డ కంకులు
ధాన్యమై
ఏటికేడాది సంబరమై

హేమంతంలో
ఉదయమెప్పుడూ
అందమైనదే
సముద్రమూ, నదీ
నీ ఇంటికొచ్చినట్టే.