మూడో తరగతి, తాతబడి

మట్టి అరుగులు
తాటాకు పైకప్పు
తాత బడి

సగం చేతుల చొక్కా
జేబులో పెన్ను
కచ్చాపోసి కట్టిన పంచె
కళ్ళజోడు
రామారావు మేష్టారు

‘అన్నయ్య
ఒక్కడూ ఉన్నాడు
మా దగ్గర’అని
వీణ్ణి తీసుకొచ్చేం.
తాతయ్య చెప్పేరు

“ఎంత వయసు”

“ఏడు వెళ్ళేయి”
“ఏమిటి పేరు”
“ప్రసాద్”

“ఏది ఓ పది పదాలు చెప్పు”
“అల,కల,వల ,పలక, ఊరు…”
“ఎక్కాలు ఏమైనా వచ్చా”
“5 దాకా వచ్చు”
“అప్పచెప్పు”

“పద్యాలేమైనా వచ్చా”

చేతవెన్న ముద్ద…
మొత్తం పద్యం విన్నారు.

“మీరు ఫారం నింపండి”

“పదరా క్లాసుకి”

“సత్తార్,
ఇదిగో కొత్త కుర్రాడు”

పేరు చెప్పి
మట్టి నేలమీద
ముందు వరుసలో
కూర్చుని
మూడో తరగతి

కొత్త స్కూల్లో
కొత్త ఊర్లో..

అమ్మ
సంగీతం అమ్మగారు
సుశీలమ్మగారు
వెంకన్న గాడు
నూకలమ్మ గుడి దగ్గిర
ఏరుకొన్న బాదంకాయలు
పాత స్కూలు
అన్నీ ఇప్పుడు
ఊర్లోనే ఉండిపోయేయి

సత్తార్ మేష్టారు,
రెడ్డిగారు
ఎర్రమట్టి,
చింతచెట్లు
ఆచారి గాడు
ఇంక…