అరగెడ్డపాడి మీసాలోడు

అరగెడ్డపాడి మీసాలోడు
తొడకొట్టినప్పుడు
నిండుసభలో ద్రౌపది గుర్తొచ్చింది
సిగ్గుతోతలవంచుకోడానికి
ద్రోణుడేడి, భీష్ముడెక్కడ

ధర్మం శ్మశానాన్ని పాలించేప్పుడు
నగరం శకారుడి బానిస
నిద్రపోని నగరాల్లో మందెక్కువ
వలలుడేడి బోసిపోయిన నర్తనశాలలో
సింహబలుడే కీచకుడని
అందరికీ తెలుసా

ఎంతకాలం నాటకం చూస్తాం
తెరలు తగలపెట్టలేని వాళ్లం
తాకట్టు ఎలా విడిపించగలం
తలకొరివి పెట్టేవాళ్లంతా
వంశోద్ధారకులు కారు
సిగ్గుపడలేని జాతి
గర్వ పడలేదు