మూడు వాటాల ఇల్లు

వెనుక వైపు పెళ్లికాని కుర్రాళ్ళు
ఇంట్లో ఉన్నప్పుడు తప్ప
ఎప్పుడు తాళం వేసే ఉంటుంది

మధ్యలో మొగుడూ పెళ్ళాం
అతను ఆటో నడుపుతాడు
ఆటో గుమ్మం ముందు ఉంటే
అతను ఇంట్లో ఉన్నట్టు

ముందు వాటా
ముసలాయనా, భార్యా,టీవీ
శబ్దం లేదంటే
పడుకున్నారని
ఇంక రాత్రి పన్నెండు దాటిందని.

మూడు అధ్యాయాల జీవితంలా
మూడు వాటాల ఇల్లు