చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ గారితో రెండు రోజులు.

రెండు రోజుల నించీ ఒకాయన నా పక్కనే కూర్చుని కబుర్లు చెబుతున్నారు. కొత్త పరిచయం. ఎక్కడా కొత్త అనిపించటం లేదు. ఏదో చిన్నగా పరిచయం చేసుకున్నాం.
కె శ్రీనివాసు, ఖదీర్ కొంచెం మా ఇద్దరినీ కలిపేరు.
మేమిద్దరం ఒకే వయసు వాళ్లం. నేను మార్చి లో పుడితే ఆయన నవంబర్. ఆయన గవర్నమెంట్ లో పనిచేసి పెద్ద హోదాలో రిటైర్ అయ్యారు. సాహిత్యం అంటే ఇష్టం. ఆయన ఇంతకు మునుపు ఏమి రాసేరో తెలీదు.
ఈ రెండు రోజులు మాటల్లో ఎలా దొర్లిపోయేయో చెప్పడం కష్టం. నేను వినడమే. అయన చెబుతూనే ఉన్నారు. సిద్ధార్థుడి లా మార్గమధ్యంలో భద్రాద్రి లో తన పుట్టుకతో మొదలు పెట్టి చేతిలో యోగవాశిష్టం,పక్కన శాంత అని ముగించారు.

అమ్మ, మామ్మ, మడి, కోనసీమ, గ్రామ జీవితం, ఎన్నెమ్మార్ ఉద్యోగం, ప్రైవేట్ చదువు, ఎమ్మే, పోలీస్ సెలక్షన్, కొత్వాలు ఉద్యోగం, ఎక్కిన మెట్లు, తాను నచ్చిన, తనను నచ్చిన స్త్రీ తో పెళ్ళి, పిల్లలు, పిల్లల అభివృద్ధి, సంతృప్తి నిండిన ఉద్యోగ విరమణ ఒక పద్ధతిలో చెబుతూనే ఉన్నారు.
ప్రతిసారీ పక్కనే ఉన్న ‘ శాంత ‘ తో సంప్రదిస్తూనే ఉన్నారు.
అన్నీ మాటలూ సాత్వికమే, ఏర్చి కూర్చిన మాటలే! ఉత్కంఠ భరితమే!
చేయని పనికి జైలుకి పోవడమైనా,
తన భుజం మీద పెట్టి పేల్చిన తుపాకీ దెబ్బకి జరిగిన మెకం మృత్యువు అయినా, ‘యూ కిల్డ్ హిం డాడా’ అన్న మాటకి కాదని చెప్పిన జవాబు సమాధానం పర్చుకోలేని సందర్భం అయినా, నిలువెత్తు మనిషిగా కనిపిస్తూ ఆశ్చర్యం వేస్తూ మాట్లాడుతూనే ఉన్నారు.

మధ్యలో కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకున్నాను. “మీ ఉద్యోగం లో చేరే రోజుల్లోనే యాదగిరి రెడ్డి హత్యకి ప్రతీకారంగా డాక్టర్ రామనాథం గారి హత్య జరిగింది కదా. మీ మీద దాని ప్రభావం ఏమిటి. కల్లోల ప్రాంతంలో జరిగిన ప్రత్యక్ష,పరోక్ష యుద్ధాల్లో మీరెలా పనిచేశారు. సోదరులతో, తమ్ముళ్ళతో, ప్రభుత్వ గణాలతో, రాజకీయ వర్గాలతో ఎలా మెసిలేరు? మచ్చలేకుందా ఎలా బయటపడ్డారు?”
అని.
ఇవన్నీ జవాబు చెప్పే ఉద్దేశ్యం లేదు కామోసు, నన్ను నాప్రశ్నలకి ఒదిలేసి ” శాంతారాం” కి వెళ్లిపోయేరు.

ఒకసారి స్నేహహస్తం చాచేక మళ్లీ కనిపిస్తారు కదా అప్పుడు అడుగుదాం నేనూ “నేనూ శాంత కూడా..”
పుస్తకాన్ని ముగించేను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *