లోపల ఇంకో ఆత్మ
ఉందని అంటూ ఉంటారు
నాకసలు నేనే తెలియదు
ఇంక వేరే ప్రశ్నార్థకం ఎందుకు?
ఒకప్పుడు
పని, తర్వాత విరామం
నిద్ర, మెలకువ
కలా, చేతనా
ఒకదాని వెంట ఒకటిగా
ఇప్పుడు
అన్నీ ఒకటే
పనే, నిస్సంకోచంగా మెలకువే
కలగలసిన కాల్పనిక వాస్తవికత
శరీరమే
పరమపట సోపాన పథం
చివరి అంకంలో
తుపాకీ ఖచ్చితంగా పేలుతుంది
రంగస్థలం నిశ్శబ్ద రత్నాకరం