అద్దంలో అదే పనిగా
చూసుకుంటూ
ఎంత దూరం జరిగినట్టు?
ఎంత వయసు తరిగినట్టు?
అందమెంత మెరిసినట్టు?
ఎప్పుడైనా
నల్ల మబ్బుల్లో
ప్రతిబింబం చూసుకున్నావా?
నల్ల సిరా లో
మునిగి తేలేవా?
కృష్ణ బిలంలోకి
తొంగి చూసేవా?
పలుమార్లు
ఊపిరి పీల్చుకుంటూ
వదిలేస్తూ
తెరిచి మూసే కన్నులతో
శబ్ద నిశ్శబ్దాల
ద్వైత మహోత్సవంలో
అద్వైతమెలా?
కనిపించని సూక్ష్మం
కనిపించేదెలా?
వెతుకులాడే సాక్ష్యం
ఎదురయ్యేదెలా?