తరువాతే తెలుస్తుంది
ఇంట్లోంచి అడుగు బయట పెట్టే
మొదటి ప్రయాణానికి
ఉద్యోగమనే పేరే కానీ
అగమ్యమని
మళ్ళీ తిరిగి వచ్చేది లేదని
తర్వాతే తెలుస్తుంది
బాల్యమూ, కౌమారమూ
కొట్టుకు పోయేయని
అద్దంలో సవరించుకున్న
కొత్త మీసం
పదే పదే దువ్వుకున్న తల
పండిపోయేదాక
ఇక మళ్లీ ఈ ప్రతిబింబం
కనిపించదని
తర్వాతే తెలుస్తుంది
మళ్లీ మళ్లీ రాగలగిన దూరమే
కళ్లల్లో అమ్మ రూపమే
దూరం
రాత్రికి, పగలుకి ఉన్నంత మాత్రమే
అని నమ్మించేవని
తర్వాతే తెలుస్తుంది
ఉదయాస్తమయాల దూరంగా
కాంతి సంవత్సరాల దూరంగా మారి
జాగృత్ స్వప్నాల మధ్య
లోలకమై ఊగుతూ
జ్ఞాపకమై, మైకమై
పుట్టుమచ్చగా
తావీదులో దాగిన
బొడ్డుతాడై
అనంత ప్రయాణం
తర్వాత తెలుస్తుంది
తెలియని దేమిటో
తర్వాతే తెలుస్తుంది
గుమ్మం దాటే తనూజు లెదురైనప్పుడు
తర్వాతే తెలుస్తుంది
జిహ్వాగ్రాన్ని అంటిపెట్టుకున్న పిలుపు