రోజూ చిగురిస్తున్నా
పరిమళ భరితమై
పుష్పిస్తున్నా
చెట్టుని
వసంతకాలంలోనే
గుర్తిస్తుంది లోకం
క్షణక్షణం
కొత్త నెత్తురు ప్రవహిస్తున్నా
వసంతం దక్కలేదని
విలాపం
బాల్యమొక్కటే
మకర తోరణమనే
వెనుక చూపుతో
నిత్యనైమిత్తిక
జీవనానందాన్ని
విస్మరించడం
విస్మయమే
ఋతువులూ
ఋతు చక్రమూ
చక్రమూ చక్రభ్రమణమూ
జనన మరణ ధ్రువాల
ఇంద్రచాప వక్రరేఖ