‘కనిపిస్తుందేమో’ అని
చూస్తూ వుంటాను.
కనిపించదు.
ఎప్పుడైనా మాట్లాడుతుందని
ఫోన్ పట్టుకు తిరుగుతాను
అప్పుడప్పుడు ఫోన్
తెరిచి చూస్తూ వుంటాను
‘ఉత్తరం రాస్తుందేమో’ అని
మాటిమాటికీ మెయిల్ చూస్తాను
ప్రపంచం దర్శనం ఇస్తూనే ఉంటుంది
ప్రతి పనికిమాలిన వాడూ
మెసేజ్ పెడుతూనే ఉంటాడు
ఆత్రంగా ఎత్తి చూస్తే
అప్పులివ్వడానికి ఎవరో
మాట కలుపుతూ ఉంటారు
రాయకుండానే రాసుకొనే
ఉత్తరాలు ఏ కళ్లతో చదవాలి?
పెదవి దాటని మాటల్ని
ఎలా వినాలి?
ఆలోచనల తెరలపై
అనుశ్రుతంగా సాగే
జీవన్నాటకాన్ని
రక్తి కట్టించడం ఎలా?