మీరు గమనించారా
మీ పదచిత్రాలు
పారిశ్రామిక వాడల కాలంలో
మీ వచనం పోరాట దశలో
మీరు చూసేరా
మీ చుట్టూ వుండే గుంపు
శాలువాలు కప్పుకొని
ఏదో కాలక్షేపానికి
కబుర్లు చెప్పుకొంటూ
తప్పనిసరి పార్కుల్లో తిరిగే
పల్చబడ్డ తెల్లజుట్టుతోనో
కిరణాల పరావర్తనానికి
అద్దాన్ని పట్టుకు నడిచే
అలిసిన మోకాళ్లతో
మద్య వినోదాలకి
వేడెక్కే చర్చలకీ
మిమ్మల్ని ఎవరూ
పిలవడం లేదా
పొద్దున్నే మీరు పలకరిస్తే
తొందరగా మాట్లాడి
ముగిస్తున్నారా
అయితే మీ శకం
ముగిసినట్టే
అడపాదడపా
మీరు రాసే పద్యాల్లో
రాజకీయ తటస్థత
జ్ఞాపకాల మాధుర్యం
ఎక్కువయ్యేయా
అంటే
కొంగల సాయంతో
ఎండ్రకాయలు
ఊరు దాటేయని….