మాట్లాడ్డం అయిపోయింది
పక్కకు తిరిగి
చిన్న పెట్టె తెరిచేడు
పాతకాలపు తాంబూలం భరిణేలా ఉంది
నోరు తెరిచేడు
రెండు వేళ్ళతో నాలుక బయటకు తీసి
డబ్బా అరలో సర్దేడు
ఇంకో అరలోంచి
కాస్త దళసరి నాలుక తీసేడు
మళ్ళీ నోరు తెరిచి
లోపల అతికించేడు
డబ్బా మూసి జేబులో పెట్టుకున్నాడు
ముందుకు నడిచి
అక్కడ గుమిగూడిన జనానికి
ఉపన్యాసం చేసేడు
ఒకసారి పెట్టె ఎక్కడో పెట్టి
మర్చిపోయేడు.
కొత్త సరంజామా సిద్ధమయ్యేదాక
చాలా ఇబ్బందిపడ్డాడు
ఒకే మాట కష్టం కాదూ?
అప్పట్నుంచి చాలా జాగ్రత్త పడతాడు
ఒక స్పేర్ సెట్ కూడా ఉంచుకున్నాడు