దగ్గర్లోనే సముద్రం
ఇసుక తిన్నెలు పరుచుకొని
ఎదురుచూస్తూనే ఉంటుంది
ఎన్నిసార్లు చుట్టాన్నై పలకరించేను?
రోజూ రంగుల మయమైన
సూర్యోదయం
ఎన్నిసార్లు కళ్ళు విప్పార్చుకొని
భంగిమ నయ్యేను
ఈ వర్ణమాలలో?
పులకిత శబ్దసహస్రాలతో
పక్షులు పిలుస్తూనే ఉంటాయి
క్రమం తప్పకుండా
రోజూ బడికెళ్లే పిల్లల్లా..
అయినా
ఎప్పుడైనా
బదులు పలికేనా
ఒహోమ్ అంటే ఒహోమ్ అని?
కాలం సంక్షుభితమనీ
సమయం సరిపోవడం లేదనీ
నన్ను నేను తరుముకోవడమే
ఇప్పుడంటే
ముక్కుకి మూతికి కట్టిన
బట్ట అడ్డమని
వైరస్ ఒక భీభత్సమని
చెప్పి తప్పించుకోవచ్చేమో కానీ
మనసు చుట్టూ ఉన్న
ఇనప తెరలు ఒప్పుకోవాలి కదా
ఒక్క లిప్త సేపు
అజాగళ స్తనాల
అసంబద్ధత
తెలుసుకోగలిగితే
ప్రపంచం ప్రమోదమే
సంగీత సమ్మోహమే
దూరానిదేముంది
కిళిమంజారో కూడా
పక్క వీధిలోనే
హిమశృంగంతో కూడా
సరాగాలాడచ్చు
కాస్త ఓపిక చేసుకొంటే
మేఘాలతో కలిసి తిరగచ్చు
24.11.20