కలలోనూ మెలకువలోనూ
మాటలోనూ మౌనంలోనూ
వెతుక్కుంటూనే ఉన్నా
నాందీ వాక్యం కోసం
బైరాగినీ, శిష్ట్లానీ
వీరభద్రుణ్ణి, బోదలేర్ని
రూమీనీ, వేమోనీ
చదువుతూనే ఉన్నా
ఉదయాన్ని, అస్తమయాన్ని
సముద్రపు అలల్నీ, పిచ్చుక సవ్వడులని
నీటి చలమల దగ్గర పావురాల కువకువల్ని
ఆడుకునే పిల్లల్ని, పొదువుకునే జంటల్ని చూస్తూనే ఉన్నా
ప్రవాస ప్రవాహంలో
ఒంటరి గంధర్వుల
ఇసుక గడియారం
చప్పుళ్లు కూడా
అయినా
అమ్మ పలకడం లేదు
పదం కదలడం లేదు
ఈ దిగుడు బావి
పెను వేసవి తాకిడికి
ఒట్టి పోయిందేమో
ఇసుక తుఫానులో
ఒయాసిస్సు
కానరావడం లేదేమో
ఊపిరి తీయడంలోనే
జీవితం సరిపోతోంది
కాలనేమి కలవరపాటులో
మాట శీతకన్నేసింది
అమ్మ పలకడం లేదు
మానస వీణ ఒత్తిగిల్లింది
అంతర్లయ సన్నగిల్లింది