నా నడక సమయాల్లో
పిల్లలు ఎదురు పడుతూంటారు
చిన్న సైకిళ్ళు తొక్కుకొంటూ
ఉత్తినే పరిగెడుతూ
రంగు బెలూన్లు పట్టుకుంటూ
అమ్మలో, నాన్నలో, నానీలో
వాళ్ళని గమనిస్తూ ఉంటారు
మెడలో తాడులేని కుక్కపిల్లలు
కొందరు పలకరిస్తారు
కొందరు తప్పుకుంటారు
కొందరు ముఖం చాటేస్తారు
కొందరు నేను పలకరించినా,
పలకరించినట్టు నవ్వినా కూడా
నా వెలిసిన జుట్టునో
గెడ్డాన్నో చూసి జడుసుకుంటారు
వాళ్లకేసి చూడనట్టు బుర్ర వంచుకొని
నడిచేస్తాను
అయినా వాళ్ళు నాకేసి చూస్తూనే ఉంటారు
..
ఓ రోజు ఓ చిన్న పిల్లాడు
నా దగ్గరకి వచ్చి అడిగేడు
Are you grandpa?
అవును, నేనూ ఒక తాతనే అన్నాను
ఆ రోజు మొదలు
రోజూ నన్ను చూడగానే
తాతా అని పలకరిస్తాడు
దగ్గరకొచ్చి చేయి కలిపి వెళ్ళిపోతాడు
కొన్నాళ్ళక్రితం సైకిల్ తొక్కుతోన్న పాప
సైకిల్ ఆపి ఆకాశంలో తెల్లగా మెరుస్తోన్న
పున్నమి చందమామని చూపించింది
పక్కనే ఉన్న నక్షత్రాల్ని కూడా
నిన్న రాత్రి
చందమామ ఎక్కడని
నిలదీసింది
అమావాస్య కదా ఎక్కడ
చూపించను?
రేపు చూపిస్తాను
ఇవాళ నక్షత్రాలు చూడమన్నాను
సప్తర్షి మండలాన్ని చూపించేను
నడక కట్టిపెట్టి కబుర్ల వ్యాయామంలో పడ్డాను
చందమామ, నక్షత్రాలు, రాత్రులు,
గాలి వీచే సాయంకాలాలు
ఆడుకునే పిల్లలు
ఇంతకంటే మనసుకి
ఆహ్లాదమెక్కడ?
2.12.20
15.12.20 సారంగలో ప్రచురణ