కొన్ని సందర్భాలతో
రోజు గడుస్తుంది
సమయాసమయాలెరుగని
ఉత్సాహంతో,
ఒకోసారి
భయంతో,
కొండొకచో
ఉదాసీనంగా
నిదరంటూ వస్తే
కొన్ని కలలతో రాత్రి…
కాలాన్ని కొలవడమెందుకు
అదేమైనా పరిమితమా?
ఇవాళే వృధా
రేపెందుకు?
ఓ వయసు దాటేక
ఏ రూపంలో వచ్చినా
కౌగలించు కోవడమే
రేపు లేదని
తీర్మానించుకోవడమే
ఇవాళ ఎప్పుడో నిన్న కదా
గాలి తిరిగినట్లే
గాలి కమ్మినట్లే
గాలి వదిలినట్లే
ఎంత దూరంనించి
ఎగురుకొంటూ వచ్చినా
ఇక్కడ ఉండడానికి రాని పక్షిలా
సమయమే
ఎదురుచూస్తూ వుంటుంది