రాత్రి మీద
నమ్మకం లేకపోతే
ఉదయాన్నెలా
చూడగలం?
ఇంట్లో కూర్చున్నంత మాత్రాన
తలుపుమీద
సుద్దగుర్తు చెరిగిపోదు
కిటికీ మూస్తే
కొంతసేపే
నీ శ్వాస నీకు వినిపిస్తుంది
తర్వాత
వినిపించేది ఆందోళనే
రాగ సంచయనాన్ని వినడానికి
చెవి సిద్ధమైతే సరిపోదు
ఎంత ఏకాంతమున్నా
ప్రశాంత చిత్తమవదు
ఎప్పుడో విన్న పక్షిగొంతు
మళ్ళీ వినిపిస్తుంది
పెరట్లో మొక్కలు పూస్తాయి
పాత ఉత్తరాలు పరిమళిస్తాయి
ఫోటోల్లో చలనమొచ్చి
సినిమా నడుస్తుంది
కడుపు నిండిన రోజు
భయాన్ని నవులుతూ
మర్నాటిని కంటుంది
….
దారి తెన్నూ తెలీని
ప్రవాసంలో
పనిలేని వేళ
కదల్లేని బందీ లా
రోజు నిర్బంధం
పక్షిలా ఎగరలేని
నిస్సత్తువ
గూడులేని నగరంలో
రేపటికంటే
ఇవాళే నిజంగా భయం
తెల్లారుతుంది
యుద్ధం ముగిసేకా
బ్రతుకు మిగిలేకా?
రాత్రి ముగుస్తుంది
హృదయ శూన్యతతోనా?
ఉదయ సూర్యుడితోనా?