వేసవిలో ఇంట్లో ఆడుకుంటున్న పిల్లల్ని పిలిచి తాతగారు పై కండువా ‘పటంలా’ చలువ చేయించుకు రమ్మని కొంచెం చిల్లరిచ్చి పంపిస్తారు. పిల్లలు వెళ్తారు. కానీ రెండు వీధుల అవతలున్న ఇస్త్రీ మనిషి డబ్బులు సరిపోవు, పూర్తి డబ్బులు తెస్తేనే చేస్తానంటాడు. పిల్లకాయలు చేతిలో ఉన్న చిల్లర చిరుతిళ్ళకి ఖర్చుపెట్టి ఆడుతూ పాడుతూ ఇంటికి చేరుతారు. తాతగారు సరే అని మిగతా డబ్బులివ్వబోతే ఇంరకుమునుపిచ్చిన చిల్లర ఖర్చైన విషయం చెప్తారు. సరే మొత్తం డబ్బులిచ్చి పంపిస్తారు. అవసరంగా బయటకి పోవాల్సిన ఆయనని చాలానే ఇబ్బంది పెడతారు.
ఇది, చాలా ఏళ్ళక్రితం ఓ పత్రికలో చదివిన గమ్మత్తైన కథ టూకీగా.
నాకు ఈ కథ ఎంతగా నచ్చిందంటే పాతికేళ్ళ పోయేక ఆ రచయితను వెతుక్కొంటూ ఇంటికి వెళ్లి కలిసి ఆమె పుస్తకాల దొంతర సొంతం చేసుకొనే దాకా. పుస్తకాలు తీసుకుని ఆమె ఆతిధ్యం స్వీకరించి ఇంటిలోంచి బయటకి రాగానే పుస్తకం తెరిచి మళ్ళీ కథ చదివేదాకా.
బహుశా తిరిగి చెప్పడంలో కథలో ఉన్న నాటకీయత, వాస్తవచిత్రణ, తప్పిపోయి ఉండచ్చు.
కథ రాసినావిడ పొత్తూరి విజయలక్ష్మి గారు. తెలుగు పాఠకులకు చిరపరిచితులు, లబ్ధప్రతిష్టులూను.
హాస్యం అలవోకగా సృష్టించగల శక్తిమంతురాలు.
ఈమె భర్త ఉద్యోగరీత్యా తూర్పు భారతదేశంలోనూ తదనంతర కాలంలో బెంగుళూరులోనూ చాలా కాలం గడిపేరు.
తన చుట్టూ ఉన్న ప్రపంచంనించే ఆమె తన కథకి కావాల్సిన ముడిసరుకు ఎంచుకొంటారు. పాత్రలూ ఆ సమాజంలోంచే వస్తారు. సహజసిద్ధమైన హాస్యాన్ని, సున్నితమైన మానవ సంబంధాలని పుక్కిట పట్టినట్టు హృదయఁగమమైన రచనని వెలాయిస్తారు.
మధ్యతరగతి మందహాసాలు, సుఖదుఃఖాలు, ప్రయాణపదనిసలు, దిగువ తరగతి ప్రజానికమ్మీద జాలి,కరుణ,ఆదరం విస్తారంగా కనిపిస్తాయి. ఉపద్రవాలు, ఉద్యమాలు,ఉత్ప్రేరకాలు, ఈమె రచనల్లో మచ్చుకైనా కనపడవు.
పాఠకులని ఆకట్టుకొనే శైలి, మెత్తని వాక్యనిర్మాణం ఆమె సొంతం. పుస్తకం చదివి పక్కన పెట్టేక, కథ,పాత్రలు,హాస్యం వెంటాడతాయి.మరోసారి చదవాలనిపిస్తాయి.పాతజ్ఞాపకాలు ముసురుకొంటాయి. మన జీవితంలోని సంఘటనలు గుర్తుకొస్తాయి. మనం చదివిన కథలో మనం కూడా ఉన్నాం అనిపిస్తుంది.
రచనలన్నీ, జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. వాస్తవికత, హాస్యచతురత, రెండు పేటల హారంగా
విజయలక్ష్మి గారి రచనలు తెలుగుభారతికి కంఠాభరణాలు.