మను పిళ్ళై కొత్త పుస్తకం The Courtesan, the Mahatma and the Italian Brahmin

మను పిళ్ళై మూడు పదుల దాటకుండానే చరిత్రకారుడుగా చరిత్ర సృష్టించేడు. ‘ఐవరీ థ్రొన్’, ‘రెబెల్ సుల్తాన్స్’ ఇంకా ‘ The courtesan, the Mahatma and the Italian Brahmin అనే మూడు పుస్తకాలతో కొత్త కోణాలని ఆవిష్కరించేడు. మూడో పుస్తకమయితే, చరిత్ర విద్యార్థులే కాకుండా సామాన్య పాఠకులు కూడా చదివి ఇన్నాళ్లూ తాము చదువుకున్న చరిత్రని పునశ్చరణ చేసుకొంటూ కొత్త విషయాలని తెలుసుకొంటారు. ఇంతకుముందు ప్రచారంలో ఉన్న తప్పుడు కథలగురించిన నేపథ్యం, రాజకీయ వాస్తవికత స్పష్టంగా తేటతెల్లమవుతాయి.

భారత చరిత్రని దేశీయ దృక్పథంతో చూడాలనే ప్రస్తుత రాజకీయవర్గం కూడా చరిత్రని వక్రభాష్యాలనించి తప్పించే ఉద్దేశయంతోకాదు. తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మల్చుకోవాలనే.

చరిత్ర ఒక జీవ ప్రవాహం, రంగుల కలనేత, ఏ రంగు కారంగు గా మనుష్యుల చరిత్రని విడదీసి చూడలేము.
దేశాన్ని పాలించిన హిందూ రాజులు, మహమ్మదీ య సుల్తానులు, తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం, రాజ్య విస్తరణ కోసం మిత్రశత్రుత్వాలు నెరిపేరే కానీ మతం ప్రాతిపదికగా కాదు.

భాగమతి కథ మొగలాయిలు సృష్టించిన ఓ కట్టుకథ. ముహమ్మద్ కులి కుతుబ్షాహ్ రాసుకున్న 1800 పేజీల ఉద్గ్రంథంలో అనేక స్త్రీల గురించి (18) ప్రత్యేకంగా 5 గురు ఇష్టమైన వనితల గురించి ఉంది గాని ఎక్కడా భాగమతి ప్రస్తావనే లేదు. నిజమిదయితే ఎక్కడనించి వచ్చింది హైద్రాబాద్ పే పేరు భాగ్యనగర్ గా మార్చాలనే ప్రస్తావన.

చరిత్రలో చాలానే ఉపకథలుంటాయి. బెంగుళూరు నాగరత్నమ్మ వీరేశలింగం గారితో తలపడడం కూడా ఒక ఉదాహరణే. ముద్దుపళని రాధికా సాంత్వనం విషయంలో, దేవదాసి రాసిన బూతు పురాణం గా కొట్టి వేయడాన్ని రచ్చ చేసి పుస్తకాన్ని పరిష్కరించి పూర్తిపాఠంగా అచ్చు వేయించింది. అయినా బ్రిటీష్ వాళ్ళ సాయంతో కొన్ని సంవత్సరాలు పుస్తకాన్నీ నిషేధించారు. ప్రకాశంగారి హయాంలో నిషేధం ఎత్తివేత జరిగింది.
ఇంకో వ్యాసం అక్బర్ భార్య జోధాబాయ్ గురించి. ఆమె గోప్ప వ్యాపారవేత్తవలె, స్వంతంగా సముద్ర వ్యాపారాన్ని నిర్వహించేది, హజ్ యాత్రకి ప్రయాణికుల్ని రవాణా చేసేడి. పోర్చుగీస్ వాళ్ళతో వచ్చిన చిక్కుల్ని సుల్తాన్ సహాయంతో పరిష్కరించి, వాళ్ళ ప్రాబల్యాన్ని కాటది చేసి, బ్రిటిష్ వాళ్ళ రాకకు దోహదం చేసింది.

అలాగే ఇంకో కథ ‘ఇటాలియన్ బ్రాహ్మిన్’ , మత ప్రచారం కోసం, దేశీయుల ఆచార వ్యవహారాలు పాటిస్తూ అచ్చం హిందు మఠాధిపతి లా వేషభూషణాలు అమార్చుకొని తమిళ ప్రాంతాల్లో తిరిగిన ఒక ఇటాలియన్ క్రీస్టియన్ మత ప్రచారకుడి కథ.

రాజుల్ని, రాజవంశావళిని కీర్తించుకొనే జనాలకి నన్గేలి కథ కళ్ళుతెరిపిస్తుంది. ట్రావంకోర్ రాజులు భూమి మీదే కాదు, చేపల వలల మీద,పెంచుకున్న మీసాలమీద కూడా పన్నులు వేసేవారు.

ఇంతేకాదు. స్త్రీల వక్షోజాల పైన కూడా పన్ను. నిమ్న జాతి ఆడ పిల్లలు పెద్ద మనిషి కాగానే వాళ్ళ వక్షోజాలు పరిశీలించి పన్ను నిర్ణయించేవారు. పన్ను కట్టకపోతే వాళ్ళు వక్షోజాలు కప్పుకోడానికి లేదు.

ఎన్నేళ్లు పన్ను కట్టిందో కానీ నంగేలి,ఇంక చాలనుకొంది. పన్ను వసూలు కోసం వచ్చినవాళ్ళకి అరిటాకులో కోసి రక్త సిక్తమైన వక్షోజాలు అందిచ్చింది. బాధతో కుప్పకూలి పోయింది. అక్కడికక్కడే ప్రాణం విడిచింది. తన గౌరవాన్ని పణంగా పెట్టదల్చుకోలేదు.

రాజు భయపడ్డాడు. ఈ ఘటన జరిగేక. పన్ను రద్దయింది.

ఇలా అనేకమైన విషయాలమీద 60 కి పైగా చారిత్రక గాథలు చదవడానికి అనుకూలంగా, సరళంగా, ఉత్కంఠ భరితంగా ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published.