పిల్లలంతా తమ ప్రపంచాన్ని, తమ భాషని, అభివ్యక్తిని, చుట్టూ ఉన్న సమాజం నించే తీసుకొని తమదైన సృజనాత్మకతతో కొత్త రూపునిస్తారు.
మూడు, నాలుగు సంవత్సరాల దాకా పిల్లలు తమ జిజ్ఞాసతో, స్వచ్ఛమైన ఇంద్రియానుభవంతో అన్నింటిని ఇముడ్చుకొంటారు. అలాగే తమదైన శైలి లో తిరిగి మనకి అందిస్తారు.

ఇది ఒక గమ్మత్తైన కాలం – పిల్లలకే కాదు తల్లిదండ్రులకి కూడా. కొత్త సంబరాలు, పద ప్రయోగాలు, సరికొత్త విస్మయాలు, నోస్టాల్జియా, తమ బాల్యాల్ని తవ్వుకొనే జ్ఞాపకాల పరిమళం.

అందరూ ఈ సువర్ణాధ్యాయాన్ని ఆనందంగా గడిపేస్తారు. కొందరే రికార్డ్ చేస్తారు. మణిబాబు పుస్తకం ఈ బాలవాక్కుల రికార్డ్.

“పుస్తకాలు కూడా దేవుడేకదా నాన్నా
నిమజ్జనం చేసేద్దామా?”

గులాబ్జాముల్ని చూపిస్తూ
‘ఇవేవో ములిగిపోతున్నాయి
కాపాడుదామా?’

‘తిలకం, పౌడర్, దువ్వెన
అన్నిపేర్లు తెలుసు పాపకి

అద్దాన్ని చూస్తూ మాత్రం
తన పేరు చెపుతుంది’

‘సముద్రం అయితే బజ్జోదు కదా’

ఎంత స్వచ్ఛ మైన ఆలోచనలు. కవిత్వం కదా యిది?

చుట్టూ ఉన్న ప్రపంచం తమలో కలిపేసుకోవడానికి వాళ్ళకి లౌక్యాన్ని, అబధ్ధాలని, వ్యంగ్యాన్ని, మోసాన్ని నేర్పుతుంది.
విస్తరించే వ్యాసంగాలతో, ఇల్లు అనే చిన్న ప్రపంచం నించి, బడి, సహాధ్యాయులు, చుట్టాలు, సినిమాలు, హీరోలు, ఇంకా తల్లిదండ్రుల స్నేహితులు, మొక్కలు, పక్షులు, జంతువులు, విశాల ప్రపంచం లోకి మెల్లగా జారుకొంటారు.

అమాయకతనీ, పారదర్శకతనీ కోల్పోతారు.

మణిబాబు పుస్తకం అమాయక బాల్యాన్ని అద్దం పట్టింది.

మణిబాబు పుస్తకం స్వచ్ఛ సురభిళాల, బాల్య చేష్టల, పదప్రయోగాల సమలంకృత. నిజానికి కవి సమలంకృత, రికార్డిస్ట్ మణిబాబు

(పుస్తకం.నెట్ లో ప్రచురితం సెప్టెంబర్ 2020)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *