ఎన్నిసార్లు
నన్ను
ఊరికీ, మీకూ
కట్టిపడేద్దామని చూసేరు?
చేతుల్ని చేతుల్లోకి తీసుకొని
మృదువుగా రాస్తూ
ప్రేమలొలకపోస్తూ
మీతోనే ఉంచేసుకొందామని
బహుధా ప్రయత్నించలేదా?
బాల్యం పొలిమేరదాటి
మీ వాకిట్లోకి వచ్చినందుకు
సందిగపట్టి
కొత్తప్రపంచానికి
బందీని చేసేరు కదా?
మీతో సభలకీ
సాహిత్య యానాలకి
చేతిసంచీలా తిప్పుకొన్నారు కాదా?
చలాన్నీ శ్రీశ్రీనీ నాబానీ
తిలక్ నీ కృశానీ శేషేంద్రనీ
ఉసిగొల్పి
గుమ్మం దాటకుండా ఆపలేదా?
చెప్పడానికి మీ గొంతు
నొప్పెట్టిందో లేదో కాని
లేఖకుడిగా చేతులునొప్పెట్టి
పద్యగద్య సమ్మిశ్ర కవనాన్ని
కథనాన్ని
చాలు చాలనలేదా?
పదాల ప్రవాహానికి
తోవమళ్లించమనలేదా?
తొలిశ్రోత
తొలి పాఠకుడు
ఈ శిక్ష చాలదన్నట్టు
పత్రికలకు పంపే
పాత కవర్ల పాత స్టాంపుల
పోస్టల్ కుంభకోణంలో
ముద్దాయిని చేసేరుకాదా?
కవిత్వం రాయడానికి
కొరకంచుతోసి
మంటపెంచి
ఆఖరికి అచ్చోసి
అందరిముందూ నిలబెట్టలేదా?
మిమ్మల్ని తప్పించుకు పోయినప్పుడు
ఉత్తరాల బాణాలతో
హింసించలేదా?
చుట్టపుచూపుగా ఇంటికొచ్చినప్పుడు కూడా
అమ్మా నాన్నల దగ్గర ఉండనిస్తేనా!
మీకేం సుదీర్ఘ కాలం
స్వప్నజీవితాన్ని గడిపి వెళ్లేపోయేరు
మీ చుట్టూ తిప్పుకొని అందర్నీ..
మేమే పరిభ్రమణల వలయంలో..
గుర్తుండేవన్నీ గుర్తుంటాయి
శ్వాసని గుర్తుచేసుకోవడం ఎలా?
గుండెని ఓ క్షణం ఆపి
గుర్తు తెచ్చుకొని
మళ్లీ కొట్టుకోమనగలమా!?