గళ్లు గీసి ఆటకు కూర్చుంటాం
నేను ఓడిన ప్రతిసారీ
అంతా సజావుగానే
ధర్మం నాలుగు పాదాలూ ఆనించి
నడుస్తుంది
నేను గెలిచేటప్పుడే
పిడుగులు పడ్డట్టు
వడగళ్ల వాన పడ్డట్టు
పావులు కదిపేసి
ఆట మళ్లీ మొదలు
పువ్వులు విసిరి
కనుసైగ చేసి
నా ఇష్టాయిష్టాలతో
నిమిత్తం లేకుండా
గెలుపు నీదే
వాక్యంతాల్లో చుక్కనైతే సరే
విసర్గనైతే కష్టం
స్వర్గం చేతులోనే
నరకమే గోడలమధ్య
దాచుకొన్న గుండెలోతుల్లో
పాట ఆగిపోయేక
మిగిలిన గాలి సవ్వడి..
వడలిన మాటలు
లుప్త కాలాస్థికలు