సీసా మూత తీసినట్లు
బుసబుసమని పొంగుతూ
చప్పుడైన గాజు గ్లాసుల్లా
రాత్రి
కమ్ముకొన్న పొగ
ఎడతెరిపిలేని వాద్యఘోష
పాటలపేటిలా
నలుగురితో నలుగుతోన్న
రాత్రి
కొడిగట్టిన దీపం లా రాత్రి
ఎప్పుడొస్తాడో తెలీని
తిరుగుబోతు మొగుళ్లా రాత్రి
వాక్యాన్ని అనుసరించే
అనుస్వారంలా
తీగలాగుతోన్న
అపార్టుమెంటు లిఫ్ట్ చప్పుడు
రాత్రి
బట్టదులిపి
బోర్డ్ తిప్పేసిన చీట్లాట చీకటి
వెలుగులో జారిన అదృష్టం
చీకటై
వెతుక్కుంటూ రాత్రి
ఉషోదయానికి
బారెడు దూరం
లింగోద్భవ కాలం
దివాస్వప్నాల
క్రీనీడ రాత్రి