ప్రతిసారీ వీళ్లు
సైనికుల గురించే
మాట్లాడతారెందుకో
యూనిఫారాలేసుకొని
తుపాకులు పట్టుకొని
సరిహద్దుల్లో
పహరా కాసే వాళ్లగురించే
వాళ్లే ఈ దేశాన్ని కాపాడుతున్నట్టు…
ఆరుగాలం
పొల్లు విత్తనాలతో
ఎరువుతో
కలుపుమొక్కలతో
పురుగుమందులతో
మట్టిని కొలిచే
వాళ్ల సంగతో?
క్రిక్కిరిసిన
నగరాల అంచుల్లో
అతలాకుతలపు
విలయావర్తపు
జీవన సంక్షోభానికి
భాష్యం చెపుతూ
ఒదులుగా ఇరుకుగా
ఇటుకులమధ్య సున్నాల
సంగతో?
సరిహద్దు యుద్ధాలకి
సన్నద్ధత చాలు
అసంరక్షిత
అస్తిత్వానికి
క్షుత్పిపాసల
వెతుకులాటకి
ప్రతిపొద్దూ యుద్ధమే
ప్రతిరాత్రీ జాగారమే
ఒప్పుకోవడానికి మనసొప్పదు కానీ ఇప్పుడున్న దుర్నీతి సమాజంలో బ్రతకడానికి పోరాటం చేస్తున్న ప్రతి మనిషీ ఒక యోధుడే, ఒక సైనికుడే.
కవిత బాగుంది. అభినందనలు.