గోడల బట్టలేసుకొని
కిటికీ బొత్తాలు కూడా బిగించుకొని
మనం ఆడుకొన్న ఆటలకి అర్ధాలేమిటి?
బాల్యం తీరంలో కట్టిన
పిచ్చుకగూళ్లకి అర్ధాలేమిటి?
సిగ్గు తెలీదప్పుడు
ఇప్పుడు విడిచింది సిగ్గే కదా!
చేయీ చేయీ కట్టుకొని
గడ్డిమేటు చుట్టూ తిరిగినట్లు
గడ్డిమేటంతా కలతొక్కినట్లు
బావుంది-
రాత్రి పక్కంతా ఒక్కిందాన వెదజల్లి..
నిజమే
చిన్నప్పుడు సాయంత్రం రాత్రిలోకి
జారిపోవడం దుఃఖం
ఎడతెరిపిలేని ఆటలకి
మర్రోజు సాయంత్రందాకా తెర
రాత్రి కలలో సాయంత్రమే ముసురుకొచ్చి…
ఉదయం కిటికీ లోంచి తొంగిచూస్తే
విడిచిపెట్టాల్సిన కౌగిలే
నాగరికత అంగరఖాల్లో పడి
రాత్రి జ్ఞాపకాల వాతూలాల మధ్య
పగటిలో కలిసీ వేచి ఉండడమే
అస్తమయంకోసం
రాత్రి గోడలే వలువలు
ఉదయం మనమధ్య
వలువలే గోడలు
విలువలే గోడలు
ఉదయం విడిచిపెట్టాల్సిన కౌగిలే
ఉదయం విరుచుకుపడ్డ వ్యావహారికమే
జ్ఞాపకం సూర్యాస్తమయం కోసం
విరిగి విరిగి ఎగిసే గాలి కెరటం
జ్ఞాపకం తలుపులన్నీ తెరుచుకొన్న
గదిలోని నిశ్శబ్దం – రాత్రి శబ్దతరంగమే
(సెప్టెంబర్ 90 నడిచి వచ్చిన దారి)