పద్యాలు ఎదురుచూస్తూ ఉంటాయి


పరిమిత
సహజ జననాల కాలంలో
మనం చూసేవన్నీ
నెలతక్కువ కవితలే

ముహూర్తాలు పెట్టుకుని
కొందరు కవి పుంగవులు
పండక్కి, పెద్ద కర్మకి
ఉగాదికి, ఉత్సవానికి,
రాజకీయ ఉన్నతికి
ప్రసవిస్తారు
ఫారం కోడిగుడ్లను పోలిన
ఈ పద్యాలు
అసమ్యోగిక క్రియ వల్లే పుడతాయి
బజారులో బోల్డంత గిరాకీ

కొన్ని పద్యాలు
సద్యోగర్భ జనితాలు
ఘటానాఘటన
పయోమృత ధారలతో
అశ్రువర్ష ధీసతులు
వర్తమాన వార్తా స్రవంతికి
తోబుట్టువులు

మరిన్ని పద్యాలు
భ్రూణ హత్యలే

పూర్ణగర్భాన్ని మోసే
కవులకోసం
పద్యాలు ఎదురుచూస్తూ ఉంటాయి
క్షణక్షణ నిరీక్షణతో.

మన్మందిర కవాటాలు తెరుచుకుని
మూసిన కనురెప్పల లోపల
చిత్ర దరహాసం చేస్తూ
ఒక పరిమళమో, జ్ఞాపకమో
అనుభవమో, కలుక్కుమన్న
గుండెశబ్దమో, రాలిపడ్డ కన్నీటి చుక్కో
పూవు విచ్చుకున్న నిశ్శబ్దమో
అక్షర రూపాన్ని వెతుక్కుంటూ ఉంటుంది

ప్రతి పద్యానికి, తనదైన
ఒక సందర్భం ఉంటుంది
సరైనవాహకం కోసం చూస్తూ
పదికాలాలు నిలవాలని