భద్దర్రావు వస్తాడు


భద్దర్రావు వస్తాడని చూస్తున్నాను. తలుపు తీసి వుంచేను. కాస్తంత గాలి వస్తోంది. దుమ్ము కూడా. హాల్లో కి నడిచి బాల్కనీ తలుపు కూడా తీసి పెట్టేను. గాలి అటూ ఇటూ కాస్త ఆడుతుందని.
అతనికి కాఫీ ఇష్టం. ఫిల్టర్ కాఫీ. హోటల్ కి వెళ్ళిన ప్రతిసారీ అతను ఫిల్టర్ కాఫీ, నేను టీ చెప్పడం రివాజు. కాఫీ అయ్యేక సిగరెట్ ముట్టించడం ఇంకో అలవాటు. ఇప్పుడు మానేసేట్ట.
పెన్షన్ వ్యవహారాల్లో తలమునకలై ఉన్నాడు. అందరికీ రిటైర్ అయిన నెల రోజుల్లో పెన్షన్ కాగితాలు వచ్చేస్తున్న రోజుల్లో ఇతనికి మాత్రం ఆరు నెలలైనా ఇంకా తెమల్లేదు. సెక్రటేరియట్ కి కూడా వెళ్ళేడు. ‘ఏవో కొన్ని కాగితాలు మిస్ అయ్యేయి వాటి కోసం డిపార్ట్మెంట్లకి రాసేం, ఈ నెలలో ఖరారు అవుతుంది’ అని చెప్పేరన్నాడు.

పొద్దున్నే వాట్సాప్ మెసేజ్ లు పంపుతాడు. గుడ్ మార్నింగ్ మెసేజ్లు కాదు. డైలీ డివైన్ డైజెస్ట్ అని ఓ పుస్తకం ఉంది అతని దగ్గర. దాన్నించి ఓ కొటేషన్ పంపిస్తాడు. నాకు అతని మెసేజ్ లు చూడడం సరదా. ఒకోసారి ఆ మెసేజులు చిత్రంగా ఉండి రోజంతా బుర్రలో తిరుగుతూ ఉంటాయి
” నీ గురించి తెలుసుకో, పరలోకం లో సుఖ పడతావు “
” ప్రపంచం నీ కంటే తెలివైనది.”
” ఆత్మ, పరమాత్మ చింతన కన్నా పరోపకారం మిన్న “
కొన్ని సూక్తులు రామకృష్ణ పరమహంస, వివేకానంద, సూరదాస్, కబీర్, జిల్లెళ్లమూడి అమ్మ, సత్యసాయి, రమణ మహర్షి పేర్ల మీద ఉంటాయి. కొన్ని anonymous అని పెడతాడు.

ఇవి ఫార్వర్డ్ లు కాదు. శ్రద్ధ పెట్టి ప్రతిరోజూ టైప్ చేసి పంపిస్తాడు.

చిన్నప్పుడు స్కూల్ లో చదువుకునేటప్పుడు అగ్గిపెట్టె సైజ్ లో ఓ పుస్తకం తయారు చేసేడు. చిన్న అక్షరాలతో ప్రముఖుల మాటల్ని దాన్లో రాసుకునే వాడు. లైబ్రరీ లో పేపర్ చదువుతూ ఎడిటోరియల్ పేజీ సంపాదకీయం పైన చిన్న బాక్స్ లో రోజూ వచ్చే కొటేషన్లు నోట్ చేసుకునే వాడు.

ఇంటర్మీడియట్ చదువు అయిపోయి కాలేజ్ వదిలేసే ఆఖరి రోజుల్లో ఆటోగ్రాఫ్ పుస్తకాల్లో కొటేషన్ లకి చాలా గిరాకీ ఉండేది. భద్ధర్రావు చాలా మందికి సాయం చేసే వాడు.

అతనికి ఇంకో హాబీ కూడా ఉండేది. మిమిక్రీ చేయడం. హై స్కూల్ రోజుల్లో స్కూల్ డే కి అతని మిమిక్రీ అందర్నీ ఆనందపరిచేది. చప్పట్ల మోతలో అతన్ని ఆహ్వానించే వారు. చిన్న పిల్లాడు తల్లి సంభాషణ స్కిట్ అదిరిపోయేది, మా డ్రిల్ మాస్టారి గొంతు, క్లాస్ మేట్ కృష్ణ వేణి గొంతు, సభాధ్యక్షుల గొంతు భలే అనుకరించేవాడు.
ఇంటర్ తర్వాత ప్రైవేట్ గా బి కామ్ చదివేడు. ఉద్యోగం పరీక్షలకి తయారయ్యే వాడు. నా నాలుగేళ్ల డిగ్రీ అయ్యేటప్పటికి అతనికి మొదటి ప్రయత్నంలోనే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది తాలూకా ఆఫీస్ లో గుమాస్తా గా చేరాడు. అప్పట్లో ఉద్యోగ ప్రకటనలు తరచుగా వచ్చేవి. మెరిట్ ఆధారంగా, కొంత సిఫారసుల ద్వారా కూడా పనులు అయ్యేవి. ముఫ్ఫైయ్యేళ్ల ఉద్యోగంలో చాలా ఊర్లు తిరిగేడు. రెండు మూడు ప్రమోషన్లు కూడా వచ్చేయి. నిక్కచ్చిగా పని చేయడం తప్ప, లంచాల కోసం ఎప్పుడూ చూసే వాడు కాదు. లంచాలు దొరికే సీట్లో ఒకసారి పడి, నిక్కచ్చిగా ఉన్నందుకు రెండు నెలల్లో బదిలీ అందుకున్నాడు. పైవాళ్లకి, కిందివాళ్లకి, బయట వాళ్లకి ఇబ్బంది భద్దర్రావు. అందుకే ఇబ్బంది లేకుండా అతన్ని తొందరగా వేరే సీట్ కి మార్చేశారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఫోన్ చేసేడు ‘ఆలస్యం అవుతోందని, తోవలో పాత కలీగ్ కనిపించేడని, అతనితో మాటలు ముగించి వస్తున్నా’నని, ‘ఓ పది నిమిషాల్లో మీ ఇంట్లో ఉంటా’నన్నాడు. బయటకి వెళ్లకు అన్నాడు
‘తొందర్లేదు రా. ఎక్కడికి వెళ్ళేది లేదు’ అని చెప్పేను

ఎప్పుడైనా వస్తాడు ఓ గంట కూర్చుంటాడు. ఏదో విషయం మీద చర్చ నడుస్తుంది. అతను ప్రారంభిస్తాడు. నేను చెప్పేది వింటాడు. మధ్యలో కొన్ని కొటేషన్లు వదులుతాడు. ఏ విషయంలో ఐనా సరే కొటేషన్లకి కొదవుండదు.

ఏమీ లేకపోతే ఇద్దరం ఎప్పుడో చదివిన వడ్డెర చండీదాస్ హిమజ్వాల లోంచి స్వప్న రాగలీన గురించిన వాక్యాలు నెమరేస్తాడు. చలం గీతాంజలి అనువాదం నుంచో, గార్డెనర్ అనువాదం నుంచో కొన్ని ఖండికలు వినిపించి ఎంత గొప్ప అనువాదమో వివరిస్తాడు.

నేను చదువుతోన్న పుస్తకం కనిపిస్తే పేజీలు తిప్పి ‘నాకెక్కవురా’ అంటాడు

” అప్పటి నుంచీ చూస్తున్నావు, మీ ఫ్రెండ్ వస్తున్నట్టేనా” అడిగింది లక్ష్మి.
‘వస్తున్నానని ఫోన్ చేసేడు.’

లక్ష్మి కి కూడా భద్దర్రావు బాగానే తెలుసు. తనతో కూడా మాట్లాడతాడు. ఆమెకి కూడా ఫిల్టర్ కాఫీ ఇష్టం. అతనొస్తున్నాడని చెప్పగానే ఫిల్టర్ వేసి కాఫీ రెడీ చేస్తుంది. లేకపోతే పొద్దున్న కాఫీ అయ్యేక నాతో పాటు మిగతా రోజంతా టీనీళ్ళే తనకీను.
వచ్చిన ప్రతిసారీ మమ్మల్ని వాళ్ల ఇంటికి రమ్మంటాడు. ఊరికి కొంచెం దూరంగా ఇల్లు. సిటీ లో దగ్గర దగ్గర పనులకి తప్ప బయటకి వెళ్ళడం నాకు ఇష్టముండదు. స్నేహితులు, బంధువులు ఎవరైనా సరే మాఇంటికి రావడమే.
ఎక్కువగా మధ్యాహ్నం సిటీ లో పనులు చూసుకుని సాయంత్రం కాసేపు మాఇంట్లో కూర్చుని వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు షాపింగ్ కి లక్ష్మి సాయం.
నేనూ, నా కుర్చీ, సోఫా, రాసుకునే బల్లా, ఫ్లాస్క్ లో టీ. డబ్బాలో ఏదో నవలడానికి. కాలం గడిచిపోతుంది.
పుస్తకం చదువుతూ ఉంటాను. ఏవో ఆలోచనలు కమ్ముతూ ఉంటాయి. పక్కన పెట్టేస్తా. ఆలోచనల ఒరవడి తగ్గుతుంది. మళ్ళీ పుస్తకం తీస్తాను. కాస్త ముందుకు సాగుతుంది. పుస్తకంతో పాటే సమాంతరంగా ఆలోచనలు సాగుతూ ఉంటాయి. ఇన్నేళ్లనించి పోగు చేసుకున్న జ్ఞాపకాలో, ఎక్కడో దాక్కున్న బాల్యమో, ఆఫీస్ సంగతులో, చదివిన పుస్తకాలలో నుంచి పాత్రలో వస్తూ ఉంటారు. చదువుతున్న పుస్తకంలో ఏదో వాక్యమో, పదమో, వర్ణనో ఈ సమాంతర చలనానికి దారి తీస్తుంది. బయటకి రావడానికి సమయం పడుతుంది.

ఇంట్లో ఉన్న ఇద్దరం మాట్లాడుకునేది తక్కువే. తన మాటలు వినిపిస్తూ ఉంటాయి ఎవరితో మాట్లాడుతుందా అని చెవులు రిక్కించి వింటాను. పిల్లల ఫోన్. లేకపోతే పక్కింటి చిన్న పిల్ల నేను చూడకుండా ఎప్పుడో ఇంట్లోకి వచ్చినట్టుంది.

ఫోన్ చేసి చాలా సేపయింది. ఇంకా రాలేదు. మెట్లు దిగి నడుచుకుంటూ గేట్ దగ్గరకి వెళ్ళేను. వాచ్ మాన్ లేచి నుంచుని సెల్యూట్ చేసేడు. గేట్ తీసే ఉంది. గేట్ బయట మొక్కల దగ్గర కూర్చుని వచ్చిపోయే వాహనాల్ని చూస్తూ ఉన్నాను.
ఆటోలు, మోటార్ సైకిళ్లు మాత్రమే తిరుగుతూ ఉండేవి ఇంతకు మునుపు. ఇప్పుడు కార్లు ఎక్కువ. మా అపార్ట్మెంట్ల లో అందరికి కార్లే. కొన్ని పెద్ద కార్లు కూడాను.

“సార్, ఏ.టీ. అపార్ట్మెంట్ ఇదేనా, బీ 203కి పార్సెల్ వచ్చింది”
మోటార్ సైకిల్ ఆపకుండానే హెల్మెట్ పైకెత్తి అడిగేడు. అవునని తల ఊపాను..తిన్నగా గేట్ లోకి దూసుకు పోయేడు కొరియర్ అబ్బాయి.

ఈ మధ్య వచ్చే కథల్లో లోతు మరీ ఎక్కువ గా ఉంటోంది నాయుడి కవిత్వం లాగ. అర్థం చేసుకోడానికి శ్రమ పడాలి అని గుర్తొచ్చింది చదువుతూ ఉన్న పుస్తకంలో కథ అసంపూర్ణంగా ఉంది. ఇప్పటి బతుకులో లోతు లేదా? అర్థం చేసుకోలేకపోతున్నానా? కథకురాలు కొత్తగా చెప్పే ప్రయత్నంలో చాలా విషయాలు స్పృశించిందా? ఫేస్ బుక్ లో అందరూ పుస్తకాన్ని మెచ్చుకున్న వాళ్ళే. బహుశా వేరే రకంగా చెప్పడానికి సంకోచమేమో!? ఇప్పటి సోషల్ మీడియా బంధాలు చిత్రమే.

ఫోన్ రింగ్ అయ్యింది. విశ్వం ఫోన్.

“హలో, ఏం విశ్వం ఏంటి సంగతి? చాన్నాళ్లయింది.”
” భద్దర్రావు కనిపించేడు. మీ ఇంటికే వస్తున్నానన్నాడు. ఓ గంట పడుతుందని నీకు చెప్పమన్నాడు. అతని ఫోన్ డిశ్చార్జ్ అయిపోయిందిట.”

భలే బావుంది అనుకుంటూ దిగినట్టే, రెండంతస్తు లూ మెట్లెక్కి పైకి వచ్చేను.

“ఏడి భద్దర్రావు రాలేదా?
మంచి నీళ్లు తాగు. కాఫీ తెస్తా”
“చంద్రకళ వస్తానంది బొబ్బట్లు చేసిందిట. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తానంది.”

చదువుతున్న పుస్తకం తీసేను. సహవాసం, అనుకోకుండా గర్భం, పెళ్లి చేసుకుందామా, ఇలాగే ఉండడమా తేల్చుకోలేని సాఫ్ట్వేర్ జీవితం, సాహిత్యం ఇప్పుడు పోస్ట్ మోడర్న్ యుగాన్ని దాటి మెటా మోడర్న్ అయ్యిందా ఇంకా అవలేదా? మిల్లిన్నియల్ అనాలా?
సంక్షుభిత కాలం అంతమవలేదా?

బొబ్బట్లు. బోర్లా పడితే బొబ్బట్లు. ఇప్పుడు ఎవరు పడ్డట్టు.

“కల, అద్దమూ, గాలి, హాలోనేస్, అస్పష్టత” ఎప్పుడైనా నాయుడ్ని అడగాలి ఇవన్నీ ఏ సీసాలో దొరుకుతాయో? ఏ వాదానికీ నప్పడు.తెలియని కాక్టెయిల్.

చంద్రకళ వచ్చినా బావుణ్ణు. ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళే ముందు, ఇంటినుంచి ఆఫీస్ కి వెళ్లేప్పుడు కూడా ఒకేలా ఉంటుంది. కడిగిన మొహంతో, సన్నటి పరిమళంతో, హుందాగా. బోల్డంత ఆప్యాయంగా.
ఒక్కర్తీ ఉంటుంది. పెద్ద ఉద్యోగం. మంచి సరదా అయిన మనిషి. అప్పుడప్పుడు ఇలా పిన్నినీ బాబయ్యనీ సంబరపెట్టడానికి వస్తుంది.

ఇద్దరూ ఒకేసారి వస్తారేమో. ఊరంతా తిరిగి అలసటతో భద్దర్రావూ, అలసట లేనట్లు ఉండే చంద్రకళా.

ఏదో పద్యం తడుతోంది

” కనురెప్పల కింద సాయంత్రం
మూసుకుంటే చీకటే
వెలుతురెక్కడ సోనియా?”

“చీకటి పడేటట్టు ఉంది. గాలి ఎక్కువగా ఉంది”

వీధి తలుపు వేసేసింది. లైట్లు వేసి పక్కన కూర్చొంది స్నానం చేసినట్టుంది అలోవెరా వాసన. పల్చగా పరుచుకున్న వెలుతురు లో లక్ష్మి.

ఈమాట ఆగస్ట్ 2023