చిక్కుబడిన శిరోజాలు
జపనీయ మూలం : యోసానో అకికో


(యోసానో అకికో(1878-1942) ఆధునిక జపాను కవయిత్రులలో అగ్రశ్రేణిలో ఉంటారు. టంక కవితా రీతిలో చాలా ప్రఖ్యాతి పొందేరు. Tangled hair 1901లో ప్రచురితమయ్యింది. ఆమె కవితల్లో శృంగారం,ఉద్విగ్న భావావేశం ఎక్కువ గా కనిపిస్తాయి)

జపనీయ “టంక” కూడా హైకూ లాంటిదే. ఎదవ శతాబ్దపు జపానులో ఈ పద్ధతి చాలా ప్రాచుర్యం పొందింది. రాజాస్థానాల్లో టంక పోటీలు నిర్వహించేవారు. 31 పదాలతో, ఐదు పాదాలుగా టంక పద్ధతిలో కవులు రాస్తారు. ఇంగ్లీష్ sonnets ని తలపిస్తుంది. ‘హ్రస్వ గీతి'(short song) అని వ్యవహరిస్తారు. కవిత్వం దృశ్యమానం కావడానికి అలంకారాలు పుష్కలంగా ఉంటాయి. వైయక్తికత, ఉత్ప్రేక్షలు, ఉపమానాలు అలవోకగా కవులు ఉపయోగిస్తారు.





1.
నల్లని జుట్టు
వేల పాయలతో చిక్కుబడింది
నా జుట్టు చిక్కుబడింది
మన సంగమోత్సవాల దీర్ఘరాత్రుల
జ్ఞాపకాల చిక్కులలో చిక్కుబడింది.

2.
నా వక్షోజాలను అదుముకో
నా స్తనాలను ఒత్తు
రహస్యాల తెరలు తొలగించు
అక్కడ ఓ పువ్వు వికసిస్తోంది
కెంపుల మెరుపుతో వాసనలు విరజిమ్ముతూ

3.
ఈ శరత్తు వెళిపోతుంది
ఏదీ కలకాలం నిలవదు
అంతా విధి లిఖితమే
నీ బలమైన చేతులతో
నా వక్షస్సు మీద సరాగాలాడు

4.
ఎటూ, ఎలా అనే మాటే లేదు
పర్యావసానం గురించి చింత లేదు
పేరుకోసం, కీర్తి కోసం పాకులాట లేదు
ఇక్కడ ప్రేమని ప్రేమించడమే
నువ్వూ నేనూ ఒకళ్ళనొకళ్ళం చూసుకుంటూ

5.
ఒడ్డున వదిలేసేరు
నీళ్లు నిండిపోయేయి
చివికిపోయింది పడవ
తెలిమబ్బుల ఆకాశంలా
అప్పుడే విచ్చుకుంటున్న శరత్కాలంలా

6.
ఓ ఇరవై ఏళ్ల జవ్వని
నల్లని పొడువాటి శిరోజాలు
దువ్వెన లోంచి జారుతున్నాయి
సగర్వంగా, సుందరంగా
– పువ్వులతో నిండిన వసంతం

7.
నా పొడుగాటి జుట్టు
నాజూగ్గా నీళ్లల్లో తేలుతోంది
–అమ్మాయి మనసులో
దాగిన అనుభూతులు
నేను చెప్పనే చెప్పను

8.
బోల్డంత ఉద్వేగంగా ఉంది
ఉండిపో, నేను నీకు ఆశ్రయమవుతా
రాత్రిని కలలతో నింపుకో
వసంత యాత్రికుడా,
గుర్తుంచుకో, దేవి కోరిక కాదనరాదు

9.
అడవిపువ్వుల్లో
ఏది తన కెంపుల్ని కాదనుకుంటుంది?
వసంతంలో
నేనెందుకు ఇలా కోరికలతో
రగిలిపోతున్నాను?