కచ్చేరీ

ఆ ఏడు సంగీత సప్తాహానికి బాలమురళి కచ్చేరి పరాకాష్ట. దానికి కారణం బాలమురళి కాదు, మా ఊరి శాస్తుర్లు.
బాలమురళి తో మృదంగం వాయించడానికి ఎల్లా వెంకటేశ్వర్లు వచ్చేడు. కానీ కచ్చేరి రోజు పొద్దున్న కుడి చెయ్యి ఏదో పురుగు కుట్టిందో ఏమో పూరీ లా పొంగింది. వాయించడానికీ కుదిరే అవకాశం లేదు. ఆయుర్వేద వైద్యుడు సుబ్బారావు గారు చూసి సున్నం బెల్లం పట్టు వేయించేరు. ఏదో ఒకచిన్న ఎర్రటి పొడుం ఇచ్చేరు తేనెతో కలిపి వేసుకోమన్నారు. బాలమురళి పక్క వాయిద్యం కోసం తికమకపడుతుంటే, అత్యవసరంగా ఎక్కడ్నుంచి వెతకాలో అని అందరూ చర్చిస్తోంటే, సుబ్బారావు గారే శాస్తుర్లు పేరు చెప్పేరు. ఎక్కడ బాలమురళి, ఎక్కడ శాస్తుర్లు. శాస్తుర్లు మృదంగం వాయించగలడని ఎవరికి తెలియదు. శాస్తుర్లు అందరికీ తెలిసింది పౌరోహిత్య బ్రాహ్మడనే. సంగీత కచ్చేరిలకి రావడం కాస్త ముందు వరుసలోనే కూర్చోడం, తనలో తాను తాళం వేసుకోవడం, తలపంకించడం, కళ్లు మూసుకుని నవ్వుకోవడం అందరికీ తెలిసిన విషయమే కానీ, అతనికి మృదంగం వాయించడం వచ్చని, అది కూడా బాలమురళి లాంటి పెద్దాయనకి వాయించగలడని ఎవరూ ఊహించలేని సంగతి. సుబ్బారావు గారు శాస్తుర్లుకి కబురు పెట్టేరు. మృదంగంతో రమ్మని.
బాలమురళి కవిగారి ఇంటిలో విడిదిలో ఉన్నాడు. ఎల్లా, సుబ్బారావుగారి ఇంటిలోనే ఉన్నాడు.
శాస్తుర్లు వచ్చేడు. నీరుకావి పంచె, భుజం మీద కండువా వేసుకొని వచ్చేడు. మృదంగం, ఇతర సరంజామాతో.

సుబ్బారావు గారు విషయం వివరించేరు. “శాస్తుర్లూ, ఇదో చిన్న పరీక్ష అనుకో, పరువు కాపాడే సందర్భం అనుకో, ఒకసారి కాస్త నీ విద్వత్తు చూబించు.” అని అడిగారు. ఎల్లా, శాస్తుర్లుని నఖశిఖ పర్యంతం ఒకసారి చూసేడు.
తివాసి పరిచేరు. శాస్తుర్లు మృదంగాన్ని సరిచూసుకున్నాడు. బిగింపులు సర్దుకున్నాడు. చిన్ని డబ్బాలోంచి ఏదో తీసి వేళ్లకి రాసుకున్నాడు. చిన్నగా తాళం వాయించి, ఎల్లా కేసి చూసేడు. ఆయన నవ్వుతూ, ఏదో ఒకటి వాయించు అని ఎడమ చేత్తో ఆది తాళం సూచించేడు. శాస్తుర్లు మొదలు పెట్టాడు. ఎల్లా సంజ్ఞలతో అందిస్తున్నాడు. శాస్తుర్లు మృదంగంతో బదులిస్తున్నాడు.ఇలా కొంతసేపు జరిగేక ఆపమని చెప్పేడు. ఎవరి దగ్గర నేర్చుకున్నావు అని అడిగేడు. “చిన్నపుడు నాన్న దగ్గర నేర్చుకున్నాను. తర్వాత మీ వంటి వాళ్ళని చూసి నేర్చుకున్నాను, విని నేర్చుకున్నాను”. అన్నాడు.

“సుబ్బారావు గారూ, గురువు గారికి కబురు పెట్టండి. చింతించక్కరలేదు, ఈవేళ కార్యక్రమానికి ధోకాలేదు.”
అక్కడి నుంచి అందరూ నడుచుకుంటూ కవిగారి ఇంటికి వెళ్లారు. బాలమురళితో ఎల్లా మాట్లాడేడు. ఆయనా ఒకసారి విన్నాడు. తానొక రాగాన్ని ఆలపించి శాస్తుర్లు తనను అందుకోగలడా అని అంచనా వేసేడు. తాను ఎంత తనని కుదించుకోవాలో అని అనుకున్నాడేమో.

సాయంత్రం కచ్చేరి దగ్గర చాలా హడావిడి అయ్యింది. ముందు చిన్నపాటి ఉపన్యాసాలు, బాలమురళిని వేదిక మీదకి పిలిచి దండలేసి, ఎల్లాని, వయొలిన్ విద్వాంసుడిని కూడా వేదిక మీద పూల గుచ్చాలిచ్చి సత్కరించారు
శాస్తుర్లు జుబ్బా వేసుకొని వచ్చేడు. పంచె గూడ కట్టేడు. ముఖానికి చిన్న బొట్టు. ఎల్లా వేదిక దిగుతూ శాస్తుర్లు భుజం మీద చెయ్యేసి ఉత్సాహ పరిచేడు.

మైకులు సద్దేరు, బాలమురళి ఫ్లాస్క్ లోంచి గోరు వెచ్చటి నీళ్లతో ఒకసారి గొంతు తడి చేసుకున్నాడు.
పక్కన శ్రుతికోసం తంబుర తీగలు మీటుతోన్న కవిగారి కోడలు విశాలాక్షి కేసి చిరునవ్వు రువ్వి ఆమె అందాన్ని ఇనుమడించేడు. జేబురుమాలుతో ముక్కు అద్దుకున్నాడు. వయొలిన్ విద్వాంసుడు కూర్చొని ఫిడేల్, తీగలు, కమాను చక్కబెట్టుకొన్నాడు.
శాస్తుర్లు కొంచెం గంభీరంగా ఉన్నాడు మృదంగం సంచీ లోంచి తీసి బాసింమటం వేసుకొని మృదంగం అమరిక సరిచేసుకున్నాడు.


బాలమురళి చిన్నగా తనకి ఊరితో సంబంధం, సంగమేశ్వర శాస్త్రి గారి గురించి, నేదునూరి గురించి, కవి గారి గురించి మాట్లాడి వాళ్ళందరికి తన నమస్కృతులు చెప్పి, పక్క వాద్యాలకి సూచన ఇచ్చి హంసధ్వనిలో వాతాపి గణపతిం ఎత్తుకున్నాడు. వయొలిన్ మోగింది. బాలమురళి గొంతు గాడిలో పడింది. శాస్తుర్లు అవసరార్థం మృదంగతో తాళం వేసేడు. తర్వాత బాలమురళి తన స్వంత కృతి పాడేడు. తాళం మారింది. హెచ్చుతగ్గులు, బాలమురళి గొంతు సునాయాసంగా అందుకుంటోంది. వదిలేసిన చోటునుంచి ఎత్తుకుని క్రిందకి జారీ మళ్లీ తనదైన పోకడలతో కచ్చేరి నడిపిస్తున్నాడు. శాస్తుర్లకోసం బాలమురళి తగ్గవలసిన అవసరం రాలేదు. అలవాటైన వయొలిన్ విద్వాంసుడు అలవోకగా బాలమురళికి
అనుసంధానం అయ్యేడు.
బాలమురళి ఎందరో మహానుభావులు అందుకున్నాడు రాగ విస్తారం చేసి, కీర్తన మధ్యలో కాస్త సందిచ్చి వయొలిన్ కేసి చెయ్యి చాపి ఇంక నీదే అని తాను పక్కకి తిరిగి విశాలాక్షికి నవ్వు విసిరాడు.
వయొలిన్ ఏకాగ్ర చిత్తంతో రాగాన్ని ఆవిష్కరించేడు. మధ్యలో అందుకుని బాలమురళి కీర్తన ముగించేడు.
శాస్తుర్లు, వయొలిన్ వాయిస్తోన్నంతసేపు చేత్తో తాళం వేస్తూ ఉన్నాడు
కీర్తన ముగిసింది సభ కరతాళ ధ్వనులతో పిక్కటిల్లింది. వయొలిన్ విద్వాంసుడు, బాలమురళి నమస్కారం చేసేరు.
తిల్లానా పాడడానికి సంసిద్ధమయ్యేడు బాలమురళి. శాస్తుర్లుకి ఈ సారి అవకాశం ఇచ్చేడు. శాస్తుర్లు సూచన అందుకున్నాడు. నెమ్మదిగా ప్రారంభించేడు. తాళ భేదాల్ని పాటిస్తూ శివతాండవాన్ని కనులముందు నిలబెట్టాడు. బాలమురళి శాస్తుర్లు విజృంభణ గమనించేడు. అడ్డకట్ట వేస్తూ తర్జనితో సంజ్ఞ చేసేడు. శాస్తుర్లు తెలుసుకొని నెమ్మదించేడు. బాలమురళి తిల్లాన ముగించే సమయానికి సభ ముందు వరుసలోనే ఉన్న ఎల్లా లేచి చప్పట్లు కొట్టనారంభించేడు. సభ అంతా లేచి కరతాళ ధ్వనులతో తమ ఊరి వాణ్ణి అభినందించారు.బాల మురళి, వయొలిన్ విద్వాంసుడు, శాస్తుర్లు అందరూ లేచి నుంచున్నారు. ఆగకుండా ఓ మూడు నిమిషాలు ఓ కొత్త కచ్చేరి నడిచింది.