మాంత్రికుడి ప్రాణం

నిన్న మరణించేక
పుట్టిన వాణ్ణి నేను
రేపటికి రెండో రోజు

జనన మరణాల
చిట్టాలో పేరులేదు
నమోదు కాబోదు
అకాల మరణం

పగలుతో రోజులు
లెక్కపెట్టే కాలంలో
రాత్రెప్పుడూ
తప్పిపోయే చీకటే

గడియ తీసి
గది తలుపు తెరిచి
అందర్నీ పిలవాలి

కనికట్టు విప్పి
ఇంద్రజాలం ముగించి
టోపీతో చిల్లర కోసం
తలవంచకు

వసారాలో కూర్చుని
ఎదురు చూస్తున్నప్పుడు
నడిచివచ్చేదెవరో
తెలిసేదెలా?

భుజంమీద మూటలో
మాటల గాజుల మలారంలో
కావలసిన హక్కులున్నాయా?
గొంతెత్తిన పోలికేకలో
నిషేధిత వాక్కులున్నాయా?
ఆజాదీకి తాళం చెవులున్నాయా?

మాంత్రికుడి ప్రాణం
మర్రి చెట్టు తొర్రలో
చిలకలో లేదు
నిషిద్ధమైన వాక్కులో ఉంది
వాడుకునే హక్కులో ఉంది
ఎదురుచూస్తున్న రేపటిలో ఉంది.

(సారంగా 15/4/23)