రహస్యాన్ని చెప్పకు

రహస్యాన్ని
చెప్పకు, దాచలేను
నలుగురికీ
తెలిసేది నాకు తెలిస్తే చాలు
ఏదీ తెలియకపోయినా
ప్రపంచం తలకిందులు కాదు

మనుషుల సంబంధాల్లోని
ఎడమరలు
ఎవరికి కావాలి?

పొరల్లోనే ఉండనీ
సొరంగాల్లోనే ఉండనీ
చిలకలోనే ఉండనీ
అధికార పత్రాల్లోనే ఉండనీ

కడుపుబ్బరముంటే
కాస్త జీలకర్ర నవులు
ఇంకా కాదంటే
ఓ గోలీసోడా పట్టించు
లేదంటే ఎవరూలేని చోట
చెట్లకో పుట్లకో
ఇసుక గుట్టలకో
నెమ్మదిగానో, బిగ్గరగానో
బయటకు పోనియ్

రహస్యాలు రహస్యాలుగానే
మిగలడం మంచిది
పాములు మెడలో
వేసుకు తిరగలేం
నడుంచుట్టూ తిప్పుకుని
పడుకోలేం
కొండచిలువ
నోట్లో తలపెట్టలేం

రహస్యాన్ని చెప్పకు
నిర్మల తటాకంలోకి
రాళ్ళు విసరకు
తిరిగొచ్చిన
పక్షులున్నాయి
తుపాకి పేల్చకు
రహస్యాన్ని చెప్పకు