Passing Through Times
Passing Through Times
Skip to content
Home
About author
About this Page/Blog
Search for:
Posted on
August 1, 2025
August 1, 2025
by
Prasad Indraganti
పదప్రవాళం
పదాలకి పవిత్రత లేదు
శబ్దానికి సాపేక్షత లేదు
అర్థమెప్పుడో అడుగంటింది
కవితకి సారూప్యత లేదు
అద్దాల గదిలో
అబద్ధాల మాంత్రికత
యుద్ధాల గడీలో
అవ్యక్త బాష్పజలధి
బాధా పరిష్వంగంలో
మాటలకందదు
గాథ చెమరిస్తుంది
కాలార్ణవమవుతుంది
వలల్లో పడేది కాదు
ములిగి, నిండా ములిగి
నిలువీది చేసే
పగడాల వేట
కాలం చక్రంలా తిరగదు
నాలుగు దిక్కులూ
ఎనిమిది మూలలూ
ఆవిరి పడుతుంది
చరిత్ర చర్వితచరణం కాదు
నిత్య సంచరణం
మరణావరణం
అమరణ తరణం
సుదూర తీరాల
యానానికి నిప్పు తోడు
జననావశేషాల
జ్ఞాన సంచితం జోడు
పదం ఎప్పటికైనా
పదును తేలుతుంది
జంత్ర ధ్వనితో
ద్వీపాలు తరిస్తుంది
మంత్రమవుతుంది
కవితామంత్రణ మవుతుంది
కాలాన్ని దాటే
అంతర్గామి అవుతుంది
Post navigation
Previous Article
కచ్చేరీ
Next Article
యుగాంతమెప్పుడు
ఎన్నో వానాకాలాల తర్వాత
అరవైనాలుగో అంతస్తు
అపార్ట్మెంటు బాల్కనీలో
చీకటిపడ్డ సాయంత్రం వేళ
మెరుపుల మధ్య చినుకులు
కాగితం పడవలు
పంచుకున్న చిల్లుల గొడుగులు
మండువా ఇంట్లో
కుంపటి మీద కాల్చిన అప్పడాలు
ఉడుకుతున్న ఆలుగడ్డ
ఆవిరి ఒలుకుతోన్న అన్నం
కరెంట్ పోయిన సాయంత్రం
హరికేన్ లాంతరు వెలుగులో
ఒక్క కంచం ఆరుగురు పిల్లలు
వరసగా తెరుచుకునే నోళ్లు
భూకంపం ముగిసేక
కురిసిన జపాన్ వాన
చిల్లులు పడే ధార
కాళ్ళకడ్డం పడుతూ
వరదలా నీరు
హోటల్ గది కిటికీలో
ముడుచుకున్న ముంగిస
ఎప్పటికీ ఆరని లోదుస్తులు
తడి తగలని చోట చెమ్మ
ఏళ్లకేళ్ళుఅరణ్య వాసం
కొన్నాళ్ళైనా తప్పని రహస్య జీవితం
ఖనిజంలో లవణం
గుర్తు తెలీని మరణం
ఎగరేసుకు పోయిన కాలం
ఎవరిదో తెలీని గాలిపటం
తెల్లటి పక్కమీద
బురదకాళ్లు
వచ్చి వెళ్లిపోయిన
ఆనవాళ్లు
అది సరే,
యుగాంత మెప్పుడు?