ఒక వెన్నెల, మళ్లీ తపస్సు

వెన్నెల
చైత్రం విచ్చుకొన్నట్టుంది

నిప్పుపూల చైత్రం
వేపగాలి చైత్రం
పుప్పొడి పరిమళం

పరమాన్నం వండిన
ఇత్తడి గిన్నెలా
ఆకాశం

ఆరుబయట
నులకమంచం మీద
కదులుతోన్న మబ్బుల వల
****

కలల్లాగే
కవితలు కూడా
దృశ్యశ్రవణ రూపాల్లో
కళ్ల ముందు కనబడతాయి

పట్టుకునే క్షణంలో
పక్షులై ఎగిరిపోతాయి

కొంగలసాయం తీసుకొన్న
ఎండ్రకాయలా
ఎండిన పుల్ల పట్టుకొని
ఎదురుచూస్తూ
తడిలేని చెరువులో
మళ్లీ తపస్సు