నువ్వెప్పుడూ శబ్దాన్ని మోసుకొస్తావు
నక్షత్రం చిగురించే వేళ మాటల్ని వెలిగించి
దీపాల వెలుగులో నీ నీడ వదిలి వెళ్ళిపోతావు.
నీ చేతులు పట్టుకుందాం అనుకుంటాను
నీ చెంపలు నిమురుదాం అనుకుంటాను
వందల వేల మాటలతో
నిన్ను ఉక్కిరిబిక్కిరి చేద్దామనుకుంటాను
మాట గొంతులోనే ఉంటుంది
నేను గుమ్మం దగ్గరే ఉంటాను
నువ్వు కూర్చొనీ కూర్చోకుండానే
నించొనీ నించోకుండానే
మాట్లాడుతూ జవాబులడక్కుండానే ప్రశ్నిస్తావు అడగని ప్రశ్నలకి నువ్వే జవాబిస్తావు
నీళ్ళకుండ చెమర్చినట్టు,
పక్షుల ప్రస్థానంలాగా
నిన్నటి స్వప్నం గురించో
మధ్యాహ్నం చెట్లగుంపులో
ఒంటరి పక్షి పాట గురించో
ఏం మాట్లాడేవో, ఏం విన్నానో, ఏం అన్నానో…
తెరపడ్డాక, రంగస్థలం మీద ఒంటరినై
నిశ్శబ్దాన్ని శ్వాసిస్తూ..