మద్రాస్ బస్సులో
మల్లెపూల చెమట వాసన
సినిమా టికెట్ల క్యూలో
పౌడర్ స్పృహ
విమానాశ్రయం
చెకింగ్ కౌంటర్ దగ్గర
ఫౌండేషన్ ముఖాలు
నైట్ క్లబ్ ఎత్తు బల్లల
చుట్టూ చేరిన
ఆడవాళ్ళ మగాళ్ల
పొగాకు నుసి
ఆల్కహాల్ బుసబుస
కూరగాయల సంతలో
తోసుకొచ్చిన పసుపు వాసన
రైలు తొడతొక్కిడిలో
జామపళ్ల బుట్ట
సమోసాల జంగిడి
తంపటకాయల తట్ట
జనమే జనమైన నిన్న
పరిక్షిత్తులా నేడు
ఒంటిస్తంభం మేడలో నేడు
నిర్జనమైన నేడు
జవజావలాడే నిన్న
ఒంటరి గజిబిజి నేడు
రేపు ఉంటుందిలే
నిన్నలా?
ఔనేమో
కాదేమో
అయినా రేపు ఉంటుంది.