వంతెన

వంతెన మీద నించున్న
ప్రతిసారీ
నవయవ్వనం
జ్ఞాపకమై ముసురుకొంటుంది
నడిచిన దూరం గుర్తుకొస్తుంది

ఒక దరి
కాల్చిన జొన్న కంకి
మరో వంక
చెరోసగం చాయ్
కథలు, గాధలు
పదసంచయాలు

తిరిగి తిరిగి
అలసి వచ్చిన శరీరానికి
ఇంటి బావినీళ్ల చల్లదనంలా

ఎప్పుడైనా పాటకోసమో
పాత జ్ఞాపకం తరిమితేనో
వంతెన మీద నెమ్మదిగా..

క్రింద నదీ
పైన నేనొక్కడినే
అయినా తిరునాళ్లలా
సందడే సందడి
ఏనాటిదీ వంతెన?