వాన పడే మండువా లో
స్తంభాల మీద
‘పద్యాల పోటీ’
‘విప్లవం వర్ధిల్లాలి’
చెరక్కుండా మిగిలిన
చిన్నప్పటి ఆనవాళ్లు
అద్దం అలమరాలో
అమ్మ మూడో తరగతి
పలక ఇప్పుడు లేదు
మావయ్య తెచ్చిన
తాజ్మహల్ బొమ్మ కూడా..
గుండ్రటి చెక్క డబ్బాలో
జోడులేని గవ్వలు
గోద్రెజ్ మడత కుర్చీలు
గాదులతో వచ్చిన
చెక్క కుర్చీలు
ఇప్పుడు లేవు
నాన్నగారి చిన్న అలారం
గడియారం
ఎన్ని సార్లు నిద్దర్లో
లేచి చూసుకునే వారో
రెండు గంటల డ్యూటీకి
తయారవడానికి
అదీ లేదు ఇప్పుడు
ఓ మూల గోడకి
సహోద్యోగులతో
నాన్నగారు
ఇంకో ఫొటోలో
తాతమ్మ
గుమ్మానికి ఎదురుగా
తాతగారి పూజలందుకొన్న
అన్నవరం దేవుడు
అదాటుగా
కిందపడి ముక్కలైన
నిలువెత్తు
బెల్జియం అద్దం
ఇప్పుడు చిన్నదై
పటమటింట్లోకి
మారింది గాని
అదీ ఇక్కడే ఉండేది
అమ్మమ్మ,తాతయ్య
తమ వార్ధక్యాన్ని
మలిచిందిక్కడే
ఇంటికంతటికీ
తలమానికమై
ఎప్పుడెళ్ళినా
పలకరిస్తూ
ముది పండిన
అమ్మలా
మేనత్తలా
నడవకి
పడమటింటికి
వారధిలా
మండువా