ఓ మధ్యాహ్నం

అందరూ బయటికి వెళ్లిన మధ్యాహ్నం ఒక్కడిని పుస్తకం చదువుతున్నాను.

కొంతసేపు పోయేక వంటింట్లో చప్పుడయినట్టినపించింది. వెళ్లి చూస్తే ఏమిలేదు. ఆంతా మామూలుగానే ఉంది. మూతలు తీసి చూస్తే, పొద్దుటి వంకాయ కూర నోరూరుస్తూ, అటూఇటూ ఒకసారి చూసి ఒక ముక్క నొట్లో వేసుకొన్నా. దాహం వేసింది. సీసా లోంచి నీళ్లు తాగి మళ్లీ హాల్లోకి వచ్చి పుస్తకం పట్టుకొన్నా. కళ్లు కదుల్తున్నాయి కానీ కథ నడవటంలేదు. లేచి బాత్రూంకెళ్లి, అద్దంలో చూసుకొని, కళ్లు ఎగరేసి, మీసం దువ్వుకొని గెడ్డం రాసుకొని, మొహమ్మీద పులిపిరి ఒకసారి తడివి బయటకొచ్చేను.

అక్కడినించి పడకగదిలో మంచం మీద దొర్లి, చెవి వెనుక గోక్కుని, తలగడ సర్ది, దుప్పటి కప్పుకొని, కాళ్లు చాపి, ఎడంపక్కకి తిరిగి, సైడు టేబుల్ మీద ఫొటో లో నవ్వులేని ముఖం చూసుకొని, మళ్లీ వెల్లకిలా తిరిగి సీలింగ్ చూస్తే చలి వేస్తోంది.

లేచి ఎ.సి. కట్టేసి,ముందుగదిలోకి వచ్చి మళ్లీ పుస్తకం తెరిచి, ఇందాకటి పేజి ఒకసారి చూసి డైనింగ్ టేబుల్ మీద బిస్కట్ డబ్బా లో బట్టర్ బిస్కట్ తిని, నీళ్లు తాగి, పడకగది లో కొక్కేనికి వేళ్లాడుతోన్న చొక్కా తొడుక్కొని, చెప్పులేసుకొని, ఇల్లు తాళంపెట్టి, బయటపడితే టైము మూడున్నర.