ఊరికెళ్తానా..

ఊరికెళ్తానా..
బస్సు దిగి
ఇంకా తేరిపారి చూసేలోగానే
ఒక ధూళి మేఘం నన్ను కమ్మేస్తుంది

అడుగు ముందుకేస్తానా
సంచీలు పట్టుకొని..

పలకరిస్తాయి
ఊరకుక్కలు
ఏదో పాతజ్ఞాపకాన్ని
వాసన చూస్తూన్నట్టు

నడకదూరమే కదా అని
భారాన్ని రొప్పుకుంటూ
మలుపుతిరుగుతానా..

కూలినగోడల
ఖాళీస్థలంలోంచి
భూభారాన్ని మోస్తున్న
ఆదివరాహమూర్తి
సకుటుంబంగా స్వాగతం చెపుతూ..

సకల కల్మషాలూ
కాలువలోనే విదిలించుకుని
రోడ్డు మీద పారుతూ
గంగ నా పాదాలు కడగడానికి
ఉరుకుతూనే…

ఎవరు ఉప్పందించేరో గానీ
గుమ్మం ముందు
తేజోమూర్తిలా
నవ్వే ముఖమై
వుత్సాహమంతా తానై
బార్లా తెరిచిన తలుపులతో
చల్ల నీళ్ల గ్లాసై..
అమ్మ

అమ్మలా ఇల్లు

కాళ్లు కడుక్కుని
కుర్చీలో కూర్చుంటే…

ఇంక స్వర్గంతో పనిలేదు