అద్దమా? శబ్దాలంకారమా?

మునివేళ్లతో తాకి
గరుకు గెడ్డాన్ని
సుతారంగా రుద్ది
నురగద్ది
తెగ్గోసినప్పుడు
చూస్తూనే వుంటా
రేజరు తాకించి..

కంప్యూటర్ స్క్రీను కనిపిస్తుంది
మబ్బులు కనిపిస్తాయి
వుక్క అనిపిస్తుంది

కాలరెత్తి
మెడ రెండుపక్కలా
వేలాడే టైని
ముడిపెట్టడంలోనే

అద్దంలో ఆఫీసు
ప్రత్యక్షమవుతుంది
అద్దాల మేడలో
చిలక గిలగిలా
కొట్టుకొంటూ..

కడుక్కొన్న ముఖం కూడా
కల్లోల సాగరమే
నవ్వు అద్దుకొన్నప్పుడు
ప్లాస్టిక్ పువ్వుల పరిమళం

చైనా కథలో
కనిపించిన సవితిలా..
అర్ధంకాదు ఈ అద్దం

అంతర్యుద్ధాలకి
అద్దం అద్దమా?
శబ్దాలంకారమా?