ఓడిపోయిన సాయంత్రం
కాలిబంతాటలో
ఎంత చెమటోడ్చేమో
ఎవరిక్కావాలి

మార్కెట్ మాయాజాలంలో
గద్దలెత్తుకపోయిన
కోడిపిల్లల సందడి
ఎవరిక్కావాలి

ఇవాళ కాకపోతే రేపైనా
తినడానికేగా.
ఎదిగేకైనా

ఆడదయ్యేక వయసుతో
పనేముంది
బట్టలకేముంది
కోసే ఉల్లిపాయకి
పొరలెవరు ఒలిచేరు

వీధి దీపాలూ
వీర మొగాళ్లు
కీచురాళ్ల డోళ్లు

అభాసు మాటలెందుకు
అమాసి నాడు
చీకటే చీకటి

Leave a Reply