వాన కురవనీ
వందేళ్లు సన్నగా దారంలా
వాన కురవనీ
చిగురించనీ చెట్లు
వికసించనీ పువ్వులు
గులకరాళ్ల చప్పుళ్లలో
పొదల్లో దాక్కోనీ కుందేళ్లు
వాన కురవనీ
రహస్యాలన్నీ బహిరంగమవనీ
తరతరాలుగా పెరుకొన్న
మట్టి కరగనీ
ఈ రోడ్లూ భవనాలూ
నాగరికతంతా నాచు పట్టనీ
హింసా ధ్వంసం దుఃఖం సుఖం
కరిగిపోనీ
కురవనీ వాన కురవనీ
ప్రణయోర్మిళంలాగ
వసంతోత్సవంలాగ
మిలమిలా మేరిసే ఎండరానీ
కిలకిలా నవ్వే పక్షులెగరనీ
కణంనించి మరో కణం
ప్రత్యుత్పత్తి కానీ
మరోసారి మనిషి నవ్వనీ
దుఃఖా దుఃఖ సుఖా సుఖ
జీవితం కొట్టుకపోనీ
ఆత్మలన్నీ చెట్లవనీ
చెట్లన్నీ పక్షులవనీ
పక్షులన్నీ పువ్వులై
ఆడుకొనే పిల్లలవనీ…..
One thought on “వాన కురవనీ”