పైకెగరేసినప్పుడు

పైకెగరేసినప్పుడు
పట్టుకోడానికే అనుకొన్నా
కొమ్మమీంచి పడే పండు
కొత్త విషయం చెపుతుందా

అంతా ఆకర్షణే
చేయి జారిపొవడం
అవకాశం కాదు అలవాటే

అడవికెళ్లినప్పుడే తెలుసు
ఈ మరణం శాశ్వతమని
ఉగ్గుపాల పాటల్లో
రంగరించిన ఆవేశమో
ఇంటి పెరట్లో ఎదిగిన
కలుపు మొక్కలో
గుమ్మం ము ందు
మొలిచిన బొమ్మజెముళ్లో

చెరువులో దొరికిన చేతివేళ్లు
పొదల్లో పాముల పుట్ట
మేడారం జాతరలొ డప్పుల మోత
తునికాకు తగువుల్లో
తూర్పారిన తుడుందెబ్బ

అద్దంలో అన్నీకనిపిస్తే
విశ్వాసం నిజం కంటే గొప్పదా
విధానం విరోధాభాసకాదా

వీర గాధల పొలికేకలో
జముకుల చప్పుళ్ల
గొంగళీల వూరేగింపులో
గీతోపదేశం రోజే
తిలకం దిద్ది నప్పుడే
వీడ్కోలు శాశ్వతమని
హలాల్ జరగబడిందనీ

అడవికెళ్లనప్పుడే తెలుసు
ఈ రణం అశాశ్వతమని
అడవికెళ్లినప్పుడే తెలుసు
ఈ మరణం శాశ్వతమని