నా శవాన్ని మోసుకుంటూ
ఈ శ్మశానంలోకి చాలాసార్లు వచ్చేను
దహనం కూడా నా చేతులతో నేనే చేసుకున్నాను
పిడికెడు బూడిదతో అన్ని నదులూ ఈదేను
మీదపోసిన కిరోసిన్ వల్ల కావచ్చు
కోర్కెలెగసిన మంటల్లో కావచ్చు
విస్ఫోటించిన విమానం వల్ల కావచ్చు
అధికార లాంఛనాలు తప్ప
ఆత్మశోకాలు తప్ప
అగ్నికెప్పుడూ ఉచ్ఛనీచాల్లేవు
తరతమ భేదాల్లేవు
అగ్నంటే
నిత్యమూ దేశాల శాంతి సంభాషణల్లో
రగులుకొనే రాక్షస బొగ్గు
అగ్నంటే
సరిహద్దుల్లేని హద్దుకోసం
కోట్లాది జనసందోహాల సంఘర్షణ
నిత్య మరణాల నిశ్శబ్ద దుహ్ఖంలో
నీడలు కూడా కన్నీళ్లు కారుస్తాయి
నిలువెత్తు ఊహలు కూడా
అద్దాల్లో పగిలిపోతాయి
భుజం మార్చుకొందామని
ముఖం చూస్తే
శవం నాదే ఇవాళకూడా
గరుడపురాణ పఠనంలో
తాత్కాలికమైన విరక్తి
జీవితం పగిలే గుడారం
పునీతమైన అగ్నిస్పర్శకోసం
నన్న నేను నీడలు కూడా మిగలని
మంటల్లో దహిద్దామని ప్రయత్నం
ఈ బరువు తప్పదు
పాత బట్టల మూటా
దేహయాత్ర సాగిపోవల్సిందే
(మే89 నడిచివచ్చిన దారి నించి)