ఒకప్పుడు ఋతువులుండేవిక్కడ

ఒకప్పుడు ఋతువులుండేవిక్కడ

మబ్బుపట్టి ఆకాశం నల్ల బొగ్గే
జలజలా నీరై తడిపినప్పుదు
పరిగెడుతూ పరిగెడుతూ
పైట సద్దుకొన్నట్లు
వెన్నెలా మబ్బూ కలిసి చల్లగాలై
సాయంత్రం రాత్రిలోకి
పేరంటమై పరచుకొనేది

గాలి తిరిగి రోజు కుదించుకొని
చిక్కని చల్లదనం పొదువుకొనేది
కంబళ్లూ గొంగళ్లూ
స్కార్ఫులూ మప్లర్లూ
ఒంటిమీద అల్లుకొనేవి

ప్రశాంతమై విశ్రాంతమై
ఉదయపు కౌగిల్లొ
సూర్యుడు వెచ్చదనమైయేవాడు

ఆర్ద్రాకార్తిలూ రొహిణీకర్తిలూ తప్ప
వేసవి సన్నజాజుల
శీతల సాయంత్రమే

ఒకప్పుడు ఋతువులుండేవిక్కడ

నగరం నలుదిక్కులా విస్తరించేక
కృత్రిమ చల్లదనాల కృత్రిమ సువాసనల
కృత్రిమ మలాముల విద్యుద్దాహాల
కరెంటుకోతల సమ్మర్దపు జనసందోహపు
ఇరుకిరికుబతుకుల వేడెక్కిన ఇనుపచక్రాల
వేనవేల మరగొంతుకల కేకల కీకారణ్యంలో
ఋతువెక్కడ? క్రతువెక్కడ?
ఇంద్రధనుస్సు ఆహ్లాదమెక్కడ?